ఆయనో రాజకీయ కురువృద్దుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో చాలా సంవత్సరాలతో పాటు రెండు సార్లు హస్తం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత తనదేనంటూ క్లెయిం చేసుకునే అవకాశం ఆయనకు ఉంది. అయితే ఇప్పుడు చేతి నీడను వీడి, గులాబీ ఆశ్రయంలో సేద తీరుతున్న ఆయనకు పదవి అనేది అందని ద్రాక్ష అవుతుందా? లేదా ఆయన కల నెరవేరుతుందా? అనేది సస్పెన్స్ గా మిగిలిపోయింది. అందుకే ఆయన గులాబీ బాస్ చుట్టూ తిరుగుతూ పదవి కోసం ఒత్తిడి తెస్తున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నది. ఇంతకూ అంత సీనియారిటీ ఉన్న సదరు నాయకుడు మరెవ్వరో కాదు ధర్మపురి శ్రీనివాస్.
అవును ఆయనే…డీఎస్ అదేనండి డి. శ్రీనివాస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత టీఆర్ఎస్ నేత, ముఖ్యమంత్రి సలహాదారుడు. గత కాంగ్రెస్ పార్టీలో పదువులు అనుభవించినా….పార్టీ మారినా.. ఆయనకు పదువుల మీద వ్యామోహం తగ్గినట్టు కనిపించడం లేదు. కాంగ్రెస్‌ను వీడి గులాబీ గూటీకి చేరి ముఖ్యమంత్రి సలహాదారుడుగా బాధ్యతలు చేపట్టిన రోజు సచివాలయంలో కనిపించిన ఆయన…ఇప్పుడు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అయితే ఈ పదవి ఏమాత్రం ఇష్టం లేని ఆయన ఇంటి పట్టునే ఉంటూ స్వంత పనుల్లో బిజీగా ఉన్నట్లు పార్టీలో….ఇటు సచివాలయంలో గుస గుసలాడుతున్నారు. పైగా గులాబీ పార్టీలోకి మారిన సందర్భంలో తనకు పదవుల మీద ఎలాంటి మోజు లేనే లేదని, కాంగ్రెసు పార్టీలో అన్ని రకాల పదవులు అనుభవించేశానని, ఇక తాను అనుభవించగలిగిన పదవి అంటూ ఏదీ లేదని.. కాబట్టి ఆ ఆశ లేదని సెలవిచ్చారు.
అయితే తనలో ఇంకా పులుపు చావలేదన్నట్లుగా తాజాగా పదవి కోసం విన్నపాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
తన సన్నిహితుల దగ్గర తనకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇవ్వాలంటూ పట్టుబడుతున్నట్లు సమాచారం. దీంతో సన్నిహితులు మాత్రం సీఎం రేంజ్లో ఉన్న నీవు చిన్న చితక పదువులు చేయడం ఏంటీ … అంటున్నా.. ఆయన ఊరుకోవట్లేదుట. కానీ డీఎస్ మాత్రం పట్టువీడగా ఏదో ఒక పదవి కావాలని గులాబీ బాస్‌కు సంకేతాలు ఇస్తున్నారని పార్టీలో గుస గుసలు వినిపిస్తున్నారు. మరోవైపు త్వరలో రెండు రాజ్యసభ ఎంపీ పదవులు తెలంగాణకు దక్కబోతున్న నేపథ్యంలో అందులో ఒకటి అయినా తనకు కట్టబెట్టాలని కూడా ఈ రెండింటిలో ఏదో ఒకటి కావాలని డీఎస్ ఆశిస్తున్నట్లు సమాచారం.