తెరాస నుంచి సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ నిష్క్రమణ దాదాపు ఖరారు అయిపోయిందనే చెప్పాలి! నిజానికి, కొన్ని నెలల కిందటి నుంచే ఈ చర్చ జరుగుతోంది. నిజామాబాద్ జిల్లా నేతలతో ఆయనకి పొసగడం లేదన్నది తెలిసిందే. వారంతా కేసీఆర్ కి ఫిర్యాదులు చెయ్యడం, అనంతరం విమర్శలూ వివరణలూ.. ఈ మధ్యనే తెరాసను సవాలు చేసే విధంగా డీఎస్ మాట్లాడుతూ ఉండటం చూస్తూనే ఉన్నాం. ముందస్తు ఎన్నికల హడావుడిలో తెరాస శ్రేణులన్నీ నిమగ్నమై ఉన్నా… ఆయన మాత్రం కాస్త దూరంగానే ఉంటూ వస్తున్నారు. దీంతో ఆయన మరోసారి కాంగ్రెస్ లోకి చేరడం దాదాపు ఫిక్స్ అనే అభిప్రాయం వ్యక్తమౌతూ వస్తోంది. ఈ దిశగా ఈరోజు మరో ముందడుగు పడింది. డీఎస్ ఇంటికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లారు.
ఉదయాన్నే డీఎస్ నివాసానికి వెళ్లిన ఉత్తమ్ కుమార్.. దాదాపు గంటసేపు సమావేశమైనట్టు సమాచారం. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజే ఢిల్లీ బయలుదేరి వెళ్లబోతున్నారు. దీంతో, హైకమాండ్ ని కలుసుకునే ముందుగా డీఎస్ తో భేటీ కావడం కాస్త ప్రత్యేకంగానే కనిపిస్తోంది. డీఎస్ డిమాండ్లను తెలుసుకుని, వాటిని హైకమాండ్ కి ఉత్తమ్ నివేదించే అవకాశం ఉందని అంటున్నారు. ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం, డీఎస్ చేరిక లాంఛనం పూర్తవుతుందన్నట్టుగానే టి. కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత సురేష్ రెడ్డిని ఇటీవలే తెరాస ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కాబట్టి, వెంటనే డీఎస్ ని చేర్చుకోవడం ద్వారా తెరాసకి గట్టి బదులు చెప్పినట్టు అవుతుందనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. ఎలాగూ తెరాసపై ఆయన తీవ్ర అంసతృప్తితో ఉన్నారు కాబట్టి, పార్టీలోకి చేర్చుకున్నాక కేసీఆర్ తీరుపై డీఎస్ తీవ్రంగా విమర్శలు చేసేందుకు అవకాశం ఉంటుందనే చెప్పొచ్చు! ఇంకోటి… ఆ జిల్లాలో ఇప్పుడున్న కాంగ్రెస్ శ్రేణులను నడిపించేందుకు కూడా ఒక పట్టున్న నాయకుడి అవసరం కనిపిస్తోంది. ఇలా చూసుకున్నా డీఎస్ ని వెంటనే పార్టీలోకి ఆహ్వానించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.