రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ అలియాస్ డీఎస్ .. టీఆర్ఎస్కు మరోసారి షాక్ ఇచ్చారు. అయితే.. ఈ షాక్ రివర్స్ ది. ఆయన వెళ్లి కుమారుడు ఎంపీ అయిన భారతీయ జనతా పార్టీలోనో.. తాను ఉన్నత స్థాయికి ఎదిగేలా సహాయపడిన పార్టీ కాంగ్రెస్‌లోనే తిరిగి చేరలేదు. ఎవరూ ఊహించని విధంగా.. ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో.. టీఆర్ఎస్ పార్లమెంట్ పార్టీ సమావేశం అయితే.. అనూహ్యంగా దానికి హాజరయ్యారు. తాను టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడినేనని … పార్టీని వదిలి పెట్టే ఉద్దేశం లేదని చెప్పకనే చెప్పారు. డీఎస్ టీఆర్ఎస్కు దూరమయ్యారో… టీఆర్ఎస్సే… డీఎస్‌ను దూరం పెట్టిందో కానీ.. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు ముందు హఠాత్తుగా ఓ రోజు నిజమాబాద్ నేతలంతా… కవిత నేతృత్వంలో సమావేశమై… డీఎస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తీర్మానం చేసి.. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపారు. అప్పట్నుంచి… డీఎస్ టీఆర్ఎస్కు దూరమయ్యారు.
ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరుతారని.. బీజేపీ వైపు చూస్తున్నారని.. ప్రచారం జరిగింది. సోనియాతో ఒకటి, రెండు సార్లు భేటీ అయ్యారు కూడా. రామ్మాధవ్తోనూ చర్చించారని చెప్పుకున్నారు. కానీ తర్వాత సైలెంటయిపోయారు. హఠాత్తుగా.. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి డీఎస్ హాజరవడంపై చర్చనీయాంశంగా మారింది. డీఎస్ ఎప్పుడూ.. టీఆర్ఎస్కు దూరం అవ్వాలని కోరుకోలేదని… నిజామాబాద్ నేతలే కుట్ర చేశారని.. ఆయన వర్గీయులు చెబుతూ ఉంటారు. అయితే…డీఎస్.. టీఆర్ఎస్ లో అంతర్గత విబేధాలకు కారణమవుతున్నారని నిజామాబాద్ జిల్లా నేతలు మొత్తం తీర్మానించారు. నిజామాబాద్ టీఆర్ఎస్ వ్యవహారాలు.. కేసీఆర్ కుమార్తె కవిత చేతుల్లో ఉండటంతో.. పరిణామాలు వేగంగా మారిపోయాయి. అయితే.. అనర్హతా వేటు నుంచి తప్పించుకునేదుకే.. డీఎస్.. పార్లమెంటరీ పార్టీ భేటీకి వచ్చారన్న అభిప్రాయం టీఆర్ఎస్లో ఉంది.
కొన్ని నిబంధనల ప్రకారం… డీఎస్‌పై… అనర్హతా వేటు వేయాలన్న ఫిర్యాదును టీఆర్ఎస్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం ఢిల్లీలో జరిగింది. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీలకు రాకపోవడాన్ని ఓ కారణంగా చూపించాలనుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసినందునే… డీఎస్ మీటింగ్ కు హాజరయ్యారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మొత్తానికి టీఆర్ఎస్కు డీఎస్ ఓ రకంగా షాక్ ఇచ్చారు.