డీఎస్. డీ. శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. సమైఖ్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి రాజ్యసభ సభ్యత్వం పొందారు. అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితి, ముఖ్యమంత్రి కే.చంద్రశే్ఖర రావుకు తలలో నాలికలా ఉండేవారు. అయితే ఆ తర్వాతే డీ.శ్రీనివాస్ పార్టీకి దూరంగా జరిగారు. డీ.శ్రీనివాస్ కుమారుడు డీ.అర్వింద్ భారత జనతా పార్టీలో చేరినప్పటి నుంచి డీఎస్ తెలంగాణ రాష్ట్ర సమితికి దూరంగానే ఉంటున్నారు. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో డీ.అర్వింద్ ఏకంగా ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవితపు ఓడించడంతో డీ.శ్రీనివాస్ మెల్లిగా పార్టీకి దూరం కావడం ప్రారంభించారు. ఒక దశలో పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయండని కూడా ప్రకటించారు. అయినా, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు మాత్రం ఈ ప్రకటనలపై ఎక్కడా స్పందించలేదు. అలాగే పార్టీలో ఎవ్వరిని పల్లెత్తు మాట కూడా అనకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి డీ.శ్రీనివాస్ రాజ్యసభ సభ్యుడనే విషయమే పార్టీ మరచిపోయింది. ఆ మధ్య తన రాజ్యసభ సభ్యత్వానికి డీఎస్ రాజీనామా చేస్తారని, కుమారుడితో కలిసి బీజేపీలో చేరతారని కూడా ప్రచారం జరిగింది. అయితే, ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కాని డీఎస్ మాత్రం బీజేపిలో చేరలేదు. అలాగని తెలంగాణ రాష్ట్ర సమితిలోను కనిపించడం లేదు. దేశంలో ఏం జరిగినా వెంటనే స్పందించే డీ.శ్రీనివాస్ గత ఏడాది కాలంగా మౌనంగా ఉన్నారు. ఆయన ఎక్కడున్నారో… ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియడం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి సమావేశాలకు కాని, ప్రభుత్వ కార్యక్రమాలకు కాని హాజరు కావడం లేదు. దీంతో ఆయన గురించి పార్టీలో చర్చ జరుగుతోంది. రాజ్యసభ ఎన్నికల దగ్గర పడడంతో మరోసారి డీ.ఎస్ ఎక్కడున్నారనే చర్చ జోరుగా కొనసాగుతోంది. ఇంతకీ డీఎప్ పార్టీతో ఉన్నారా… లేక పార్టీని వీడారో తెలియక పార్టీ శ్రేణులు కలవరపడుతున్నారు.