సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ పార్టీ మార్పుపై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చేసింది. ఆయన తాజాగా ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వచ్చారు. దీంతో.. లైన్ క్లియర్ అయిపోయినట్టే..! అయితే, ఈ నేపథ్యంలో తెరాస ఏం చేస్తుందనేది కొంత ఆసక్తికరంగా మారింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఆయన పాల్పడుతున్నారంటూ చాన్నాళ్ల కిందటే డీఎస్ మీద తెరాస అధినాయకత్వానికి నేతలు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, ఆ తీర్మానంపై సీఎం కేసీఆర్ స్పందించలేదు. కానీ, ఇప్పుడు డీఎస్ ఢిల్లీ వెళ్లొచ్చాక కూడా చర్యలు తీసుకోకపోతే… తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెరాస నేతలు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో చర్యలకు గులాబీ బాస్ సిద్ధమౌతున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి.
డీఎస్ మీద రాజ్యసభ ఛైర్మన్ కి ఫిర్యాదు చేసే యోచనలో తెరాస ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఆయన పాల్పడుతున్నారనీ, ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ ఫిర్యాదుకు సిద్ధమౌతున్నారట! ఫిర్యాదు ఏరకంగా ఉండాలీ, ఏయే అంశాలను ప్రధానంగా రాజ్యసభ ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లాలనే దానిపై కొంతమంది నేతలతో సీఎం మాట్లాడారనీ గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో నిజామాబాద్ జిల్లా నేతలు చేసిన తీర్మానం దగ్గర్నుంచీ అన్నీ తెప్పించుకుని మరోసారి పరిశీలిస్తున్నారట!
సాంకేతికంగా చూసుకుంటే డీఎస్ పై అనర్హత వేటు సాధ్యమా అనే చర్చా జరుగుతోంది. ఎలా అంటే… సాధారణంగా తెరాస నిర్వహిస్తున్న ఏ కార్యక్రమాలకూ ఆయన ఈ మధ్య హాజరు కావడం మానేశారు కదా. కానీ, ఎంపీలతో ఢిల్లీలో తెరాస నిర్వహించిన సమావేశానికి ఆయన వెళ్లడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. తనపై అనర్హత వేటు పడకుండా ఉండాలనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే డీఎస్ సమావేశానికి వచ్చారని కొందరు తెరాస నేతలు అంటున్నారు. అయితే, ఆయన ఇతర పార్టీలకు వెళ్లకుండా ఉండేందుకే ఇన్నాళ్లూ తెరాస అధినాయకత్వం చర్యలు తీసుకోలేదనే అభిప్రాయమూ ఉంది. కానీ, ఇప్పుడు ఆయన అమిత్ షాని కలిసి వచ్చాక కూడా చర్యలు లేకపోతే, సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతాయని కొంతమంది తెరాస నేతలు అంటున్నారట! మరి, డీఎస్ పై చర్యలకు ఈసారైనా తెరాస నుంచి కార్యాచరణ ఉంటుందా లేదా అనేది చూడాలి.