ఎపి ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సిపి అద్యక్షుడు జగన్కు గతంలో ఇచ్చిన బెయిలు రద్దు చేయాలంటూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ను సిబిఐ కోర్టు కొట్టి వేసింది. మాజీ సిఎస్ రమాకాంతరెడ్డితో కొమ్మినేని శ్రీనివాసరావు ఇంటర్వ్యూలో అక్రమాస్తుల కేసుకు సంబంధించిన వ్యాఖ్యలు రావడం ప్రభావితం చేసే ప్రయత్నమని సిబిఐ ఆరోపించింది.అయితే ఈ కేసు నిలిచేది కాదని గతంలోనే చెప్పుకున్నాము. అయితే కొన్ని చానళ్లు పత్రికలు మాత్రం జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్నట్టు ఆయన స్థానంలో వైఎస్ భారతి పగ్గాలు చేపట్టనున్నట్టు వూహాగానాలు చేశాయి. తెలుగుదేశం నాయకులు కూడా మళ్లీ జైలుకు వెళతారనే వూహించారు.అయితే వీటన్నిటికి తెరదించుతూ న్యాయస్థానం పిటిషన్ను తోసిపుచ్చింది.దీనివల్ల బహుశా వైసీపీ వాదనలకు మరింత బలం చేకూరినట్టవుతుంది. సాక్షిలో ఏదో ఇంటర్వ్యూ వచ్చింది గనక బెయిలు రద్దు చేయడం కుదరదని ముందునుంచి అనుకుంటున్నదే. అయితే ఈ కొద్ది రోజుల పరిణామాలు వైసీపీలో సన్నద్ధతను పెంచాయని చెప్పాలి. కేసు తిరగదోడితే ఏం చేయాలన్నది ఆలోచించుకోవలసిన పరిస్థితిని వారికి కల్పించింది. ఇప్పుడు కొట్టేశారు గనక ఆయన విదేశీ యాత్రకుకూడా ఆటంకాలు వుండవు.
ఈ సందర్భంగా రమాకాంత రెడ్డిని ఇంటర్వ్యూ చేయడంలో కొమ్మినేని చేసిన పొరబాటేమీ లేదని కూడా జగన్ భావించినట్టు చెబుతున్నారు. కాకపోతే ఇప్పుడు కేసు వచ్చింది గనక ఇకపైన ఇలాటివి జరక్కుండా మరింత జాగ్రత్త పడాలని నిర్ణయం తీసుకున్నారట.