బలవంతుడిదే రాజ్యం. ఇది ఆటవిక నీతి. ఆకుని మేక తింటది. మేకని పులి తింటది. ఆ మేకని పులి వేటాడుతుంది. పాముకి కప్ప, గద్దకు పాము… ఆహారంగా మారడం ప్రకృతి ధర్మం. అచ్చంగా ఇదే సూత్రాన్ని `పుష్ష` పాటలో వివరించారు చంద్రబోస్. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సినిమా `పుష్ష`. ఇందులోని తొలి పాటని ఈరోజు విడుదల చేశారు. `దాక్కో దాక్కో మేక – పులొచ్చి కొరుకుతుంది పీక` అంటూ సాగే ఈ పాటని దేవిశ్రీ ప్రసాద్ తనదైన శైలిలో ట్యూన్ చేశాడు. ఆర్కెస్ట్రేజేషన్, సౌండింగ్ పూర్తిగా కొత్తగా వినిపిస్తాయి. లిరికల్ వీడియోలో బన్నీ వేసిన సింపుల్ స్టెప్స్, తన గెడ్డం, లుక్స్.. ఇవన్నీ తప్పకుండా ఫ్యాన్స్కి మెప్పించేవే. చంద్రబోస్ సాహిత్యం కూడా సింపుల్ గా ఉంది. మరీ అద్భుతమైన భావ చిత్రణ కనిపించలేదు గానీ, ఆహార చక్రం మాత్రం గిర్రున తిరిగింది. చివర్లో తనదైన స్టైల్ వుంది కూడా.
”బతిమాలితే పుట్టదు అరువు” అని ఎవరైనా రాస్తారు.. కానీ
”దేవుడికైనా దెబ్బే గురువు” అని ముగించడం చంద్రబోస్ స్టైల్.
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. దాన్నే
తన్నులు చేసే మేలు
తమ్ముడు కూడా సేయడు…
గుద్దులు చెప్పే పాఠం
బుద్ధులు కూడా సెప్పడెహే..
అని మార్చాడు చంద్రబోస్.
మొత్తానికి బలవంతుడిదే రాజ్యం అనే సూత్రాన్ని అన్వయించుకుంటూ సాగే పాట ఇది. సుకుమార్ పిక్చరైజేషన్, బన్నీ స్టెప్పులు తోడైతే – ఇంకెంత సూపర్ గా ఉంటుందో.