ఈ దీపావళికి నాలుగు సినిమాలొస్తే, అందులో రెండు డబ్బింగ్ సినిమాలున్నాయి. అమరన్, భగీర ఇక్కడ దీపావళికి వచ్చిన అనువాద చిత్రాలు. తెలుగులో లక్కీ భాస్కర్, క చిత్రాలు విడుదలయ్యాయి. భగీరని పక్కన పెడితే.. మిగిలిన మూడు సినిమాలకూ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అమరన్, లక్కీ భాస్కర్, క చిత్రాలు దీపావళిని క్యాష్ చేసుకోగలిగాయి. అయితే.. ‘అమరన్’ డామినేషన్ కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. మల్టీప్లెక్సుల్లో ఎక్కువ ఆధిపత్యం చూపిస్తోంది అమరన్. ఇదో డబ్బింగ్ సినిమా. ఐనా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. తెలుగు ప్రేక్షకులు ఎంత గొప్పవాళ్లంటే సినిమా నచ్చితే ఏ భాష నుంచి వచ్చిందన్నది చూడరు. ఆ విషయంలో మెచ్చుకోవాల్సిందే. కానీ తెలుగులో ప్రామినెంట్ గా సినిమాలు ఉన్నప్పుడు, పర భాషా చిత్రాలు విడుదలైతే, అది తెలుగు సినిమాకు దెబ్బ.
నిజానికి తెలుగులో క, లక్కీ భాస్కర్ చిత్రాలు మాత్రమే విడుదలైతే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించండి. అమరన్కు తెగిన టికెట్లన్నీ… ఈ రెండు సినిమాలూ పంచుకొనేవి. వసూళ్లు పెరిగేవి. డబ్బింగ్ సినిమాలు తెలుగులో రాకూడదని కాదు. కానీ సీజన్ ముఖ్యం. మన తెలుగు సినిమా ‘క’ని తమిళంలో అక్కడి నిర్మాతలూ, డిస్టిబ్యూటర్లూ అడ్డుకొన్నారు. తమిళంలో దీపావళికి వస్తున్న సినిమాలకు ‘క’ అడ్డుతగులుతుందని వాళ్ల భయం. అందుకే.. ‘క’ తమిళంలో విడుదల కాలేదు. అక్కడ ఓ వారం ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారు. మనం మాత్రం ఏ భాషలో సినిమా విడుదలైనా, అది ఎలాంటి సీజన్ అయినా, వాళ్లకు థియేటర్లు ఇచ్చేస్తాం. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. సంక్రాంతి, దసరా, దీపావళి లాంటి సీజన్లలో పక్క రాష్ట్రాల నుంచి వచ్చే డబ్బింగ్ సినిమాలకు చెక్ పెట్టాలి. ఓ వారం ఆలస్యంగా విడుదల చేయమనాలి. అప్పుడు తెలుగు సినిమాలకు మంచి వసూళ్లు దక్కుతాయి. ఇక్కడ ఎవరూ ఎవరికీ చేసిన అన్యాయం ఏమీ ఉండదు. తమిళనాట తమిళ చిత్రాలకే ప్రాధాన్యం ఇచ్చినప్పుడు తెలుగులో ఆ రూల్ ఎందుకు వర్తింపజేయకూడదన్నదే అసలు ప్రశ్న. దీనికి తెలుగు నిర్మాతలే సమాధానం చెప్పాలి.