అలనాటి ప్రముఖ హిందీ సినిమా నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకి ఎంపిక చేసినట్లు కేంద్ర సమాచార ప్రసారశాఖ శుక్రవారం ప్రకటించింది. ఈ అవార్డుతో ఆయనకు బంగారు కమలం, రూ.10 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు.
మనోజ్ కుమార్ వయసు 78సం.లు. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న అబ్బోట్టాబాద్ పట్టణంలో 1937జూలై 24న ఆయన జన్మించారు. దేశవిభజన జరిగిన తరువాత ఆయన తల్లితండ్రులు డిల్లీకి వచ్చి స్థిరపడ్డారు. ఆయన 19 ఏళ్ల వయసులోనే ‘ఫ్యాషన్’ అనే సినిమాతో 1957లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1960లో విడుదలయిన ‘కాంచ్ కి గుడియా’ సినిమాతో ఆయన హీరోగా సినీ జీవితం ప్రారంభించారు. అప్పటి నుండి మళ్ళీ ఏనాడు వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు ఆయనకి.
సుమారు రెండు దశాబ్దాలకు పైగా హిందీ చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగారు. పియా మిలన్ కీ ఆశ్, రేష్మి రూమల్, సుహాగ్ సిందూర్, నకిలీ నవాబ్, గ్రహస్థి, ఆప్నే హువే పరాయి, గుమ్నాం, సావన్ కి ఘట, నీల్ కమల్, మేరా నం జోకర్, పెహ్ చాన్, బలిదాన్, హరియాలీ ఔర్ రాస్తా, ఓ కౌన్ తీ, హిమాలయ కి గోద్ మే, దో బదన్ వంటి అనేక సూపర్ హిట్ సినిమాలు చేసారు. అదే సమయంలో బాలీవుడ్ లో రాజ్ కుమార్, దేవానంద్, మనోజ్ కుమార్, రాజ్ కపూర్, రాజేష్ కన్నా, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ వంటి అనేకమంది హేమాహేమీలు కూడా పోటాపోటీగా వరుసగా మంచి హిట్ సినిమాలు అందిస్తుండేవారు. అంత మంది హీరోలు ఉన్నప్పటికీ మనోజ్ కుమార్ ఒక మంచి రొమాంటిక్ హీరోగా మంచి పేరు సంపాదించుకొన్నారు.
సూపర్ హిట్ చిత్రాలయిన ఉపకార్, పూరాబ్ ఔర్ పశ్చిమ్, షహీద్ వంటి దేశభక్తి సినిమాలకు ఆయనే దర్శకుడు. ఆ తరువాత మళ్ళీ రోటీ కపడా ఔర్ మకాన్, క్రాంతి, సన్యాసి, దస్ నంబరి వంటి అనేక సూర్ హిట్ సినిమాలు అందించారు. ఆయన చివరిగా నటించిన చిత్రం 1995లో విడుదలయిన మైదాన్ ఏ జంగ్. అది ఫ్లాప్ అయింది. ఆ తరువాత ఆయన దర్శకత్వంలో తన కుమారుడు కునాల్ గోస్వామిని హీరోగా పెట్టి 1999లో జై హింద్ అనే దేశభక్తి చిత్రాన్ని నిర్మించారు. కానీ అది కూడా ఫ్లాప్ అయింది. ఇక అప్పటి నుండి మరి సినిమాలు చేయలేదు. ఆ తరువాత 2004 ఎన్నికలకు ముందు ఆయన ముంబైలోని శివసేన పార్టీలో చేరి రాజకీయాలలో ప్రవేశించారు. కానీ రాజకీయాలలో అంతగా రాణించలేదు.
ఆయన మొత్తం 13 ఫిలింఫేర్ అవార్డులు, ఐదుసార్లు జీవనసాఫల్య పురస్కారాలు అందుకొన్నారు. 2008లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆయన పేరును భారత్ రత్న అవార్డు కోసం సిఫార్సు చేసింది. 2009లో ఫాల్కే రత్న అవార్డు, 2012లో భారత్ గౌరవ్ అవార్డు అందుకొన్నారు. అదే సం.లో ఆయన పేరు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకి ప్రతిపాదించబడింది కానీ సౌమిత్రా చటర్జీకి అది దక్కింది. ఇప్పుడు అదే అవార్డుకి ఆయన ఎంపికయ్యారు. ఆయన 1957 నుండి 1995 వరకు సినీ పరిశ్రమలో ఉన్నా చాలా పరిమితంగా కేవలం 51 సినిమాలు మాత్రమే చేసారు. వాటిలో చాలా సినిమాలు ఆణిముత్యాల వంటివే. చాలా సినిమాలు సూపర్ హిట్లే. హిందీ సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గౌరవిస్తూ కేంద్రప్రభుత్వం ఆయనకీ అత్యంత ప్రతిష్టాత్మకమయిన ఈ దాదా ఫాల్కే అవార్డుని ఇవ్వడం పట్ల సినీ ప్రముఖులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.