కళకి మాటొస్తే… ‘దొరకునా ఇటువంటి సేవా’ అంటూ ఆయన పాదాలపై పడి మూగగా రోధిస్తుంది!
నాట్యానికి నడకొస్తే… ‘వే వేల గోపెమ్మలా.. మువ్వా గోపాలుడే..’ అంటూ ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంది!
సంగీతానికి శ్వాసనిస్తే… ఆయన ఉచ్వాస నిఛ్వాసల్లో వేణుగానమై ప్రభాశిస్తుంది!
సాహిత్యానికి ఓరూపం లభిస్తే.. ఆయనతో కలసి స్నేహం చేయాలని ఉవ్విళ్లూరుతుంది!
ఆయన.. ఇంకెవరు.. కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ తప్ప !!
తెలుగు సినిమా మూస ధోరణిలో కొట్టుకుపోతుంటే
హీరోయిజం మధ్య నలిగిపోతుంటే
ఆర్భాటల నడుమ ఆవిరైపోతుంటే..
తెలుగు సినీతల్లి ఆక్రోశించి, గొంతు చించుకొని ఏడుస్తుంటే… బుజ్జగించి, లాలిపాడడానికి వచ్చినవాడు… విశ్వనాథ్.
జోల పాటతో ఆపాడా ? లాలించాడు.. పాలించాడు.. తెలుగు సినిమా కీర్తిని నిలబెట్టాడు. నలుదిశలా చాటాడు.
తెలుగు సినిమా అర్థాన్ని మార్చి..కొత్తదారిని చూపించి, కళాత్మక చిత్రాల వైపు వేలుపట్టుకొని నడిపించాడు. విలువల రుచి చూపించాడు. సంగీతం, సాహిత్యాల అర్థాలు వివరించాడు. నాట్యం నేర్పించాడు. మొత్తానికి కళల నాగలితో వెండితెరపై వినోదాల వ్యవసాయం చేశాడు. తెలుగు సినిమా పురోభివృద్ధికి సాయం పట్టాడు.
విశ్వనాథ్ సినిమాలో కథ ఉంటుంది ,కళ ఉంటుంది,నాట్యం,గానం, సంగీతం, చిత్రలేఖనం…ఈ విద్యలతో వెండి తెర కళకళలాడిపోతుంటుంది.
హీరో ధీరుడు కాడు.. కళాకారుడుంతే!
హీరోకి కండలుండవు… కళ మాత్రమే ఆభరణం
ఫైట్లు చేయడు.. అమృత ధార కురినట్టు పాటలు పాడతాడు!
రొమాన్స్ మాత్రం ఉంటుంది.. కానీ అదీ సంగీతం తోనే!
ఒక్క మాటలో సినిమా అంతా.. ఓ కలలా ఉంటుంది. కళ మాత్రమే కనిపిస్తుంది.
అరవై ఏళ్ల ముసలోడిని హీరో చేయడం ఆయనకే చెల్లింది. మాస్ హీరో చిరంజీవిని చెప్పులు కుట్టేవాడికింద చూపించే సాహసం ఆయనకే అబ్బింది.
ఆయన సినిమాకెళ్లడమంటే… ఓ కచ్చేరిలో కూర్చోవడమే. గుడికి వెళ్లి పవిత్రంగా దేవుడికి దండం పెట్టుకోవడమే.
అగరొత్తులు ఘమఘమ నడుమ భగవద్గీత వినడమే. పవిత్రమైన ఖురాన్ పటించడమే. బైబిల్ని అవపాసన పట్టడమే.
కళ మాటున మానవ సంబంధాల విలువల్ని చాటుతారు.
కథతో పాటు.. కాలం నడకని కళ్లకు కట్టినట్టు చూపిస్తారు.
కళామతల్లి కాలి గజ్జెల సిరిసిరి మువ్వ ఆయన!
చీకట్లో ఉన్న సినిమాపై సిరివెన్నెల చిందించిన చంద్రుడాయన!
సాగర సంగమంలో పునీతమైన స్వాతి ముత్యం ఆయన..!
ఎన్ని సినిమాలు… ఎన్ని అద్భుతాలు. అవన్నీ తెలుగు భాష, సంస్ర్కృతికి అద్దం పట్టేవే. తన దగ్గరకు వచ్చిన నటుల్ని ఆయన ఉత్త చేతులతో పంపరు.. చేతిలో `నంది` పడాల్సిందే. ఎంతోమంది హీరోల్ని ‘నటులుగా’ మార్చిన ఘనత ఆయనది. తెలుగు సినిమాలో ఇంకా కళ బతికి ఉందంటే.. సినిమా అంటే వ్యాపారం కాదు, కళ కూడా అని ఇప్పటికీ గర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే.. అదంతా ఆయన భిక్షే.
తెలుగు సినిమా చరిత్రలో విశ్వనాథ్‌ది ఓ సువర్ణాధ్యాయం. అనితర సాధ్యమైన ప్రయాణం. ఆయన సినిమాలు ఉద్గంధాలు.. నిత్య నూతన సుగంధాలు.. నిరంతర పారాయణ పాఠాలు. తెలుగు సినిమా చరిత్రకు ఇన్ని మరపురాణి మణిహారాల్ని, ఆణిముత్యాల్ని అందించిన విశ్వనాథ్‌కి ప్రణామాలు చేస్తూ… ఆయన కళాదీక్షకు జోహార్లు అర్పిస్తూ.. దాదా సాహెబ్ ఫాల్కే సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేసుకొంటున్నాం..