మిథున్ చక్రవర్తికి ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఈ మేరకు కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబరు 8న జరగనున్న జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా మిథున్ చక్రవర్తికి ఈ అవార్డు అందజేయనున్నారు. 1976లో ‘మృగాయ’ చిత్రంతో నటుడిగా తన ప్రయాణం ప్రారంభించారు మిథున్ చక్రవర్తి. తొలి సినిమాతోనే ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకొన్నారు. బాలీవుడ్ కి బ్రేక్ డాన్స్ పరిచయం చేసిన హీరో మిథున్ చక్రవర్తినే. ‘డిస్కో డాన్సర్’లో మిథున్ వేసిన స్టెప్పులకు అప్పట్లో థియేటర్లు ఊగిపోయాయి. ‘ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్’ పాట ఓ ట్రెండ్ సెట్టర్. ‘ప్రేమ్ వివాహ్’, ‘అమర దీప్’, ‘సాహస్’, ‘త్రినేత్ర’, ‘దుష్మన్’, ‘మై ఔర్ మేరీ సాథీ’ లాంటి సూపర్ హిట్లు మిథున్ ఖాతాలో ఉన్నాయి.
మిథున్ హీరో పాత్రలకే పరిమితం అవ్వలేదు. విలన్ గా, సహాయ పాత్రల్లోనూ రాణించారు. హిందీ తో పాటు బెంగాలీ, కన్నడ, భోజ్పురి, ఒరియా చిత్రాల్లోనూ నటించారు. తెలుగు ప్రేక్షకులకూ మిథున్ పరిచయమే. ‘గోపాల గోపాల’లో స్వామిజీగా ఓ కీలక పాత్రలో కనిపించారు. ఇప్పుడు హను రాఘవపూడి ‘ఫౌజీ’లో ఆయన ప్రభాస్ తండ్రిగా నటిస్తున్నారు. ఈ యేడాది ప్రారంభంలోనే మిథున్ కు కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించింది. ”దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది. మాటలు రావడం లేదు. ఈ విజయాన్ని ఎప్పుడూ ఊహించలేదు. ఈ అవార్డు నా అభిమానులకు అంకితం” అంటూ తన ఆనందాన్ని పంచుకొన్నారు మిథున్ చక్రవర్తి.