2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున యువత బరిలోకి దిగుతారు అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో ప్రకటించారు. రానున్న రాజకీయాలకు కొత్త రక్తం రావాలని ఆహ్వానించారు. దాదాపు ఓ ఆర్నెల్ల కిందట ఓ ప్రకటనలో పవన్ చెప్పిన మరోమాట… వచ్చే ఎన్నికల్లో 60 శాతం టిక్కెట్లు కొత్తవారికి ఇస్తామని చెప్పారు. తాజాగా పవన్ చేస్తున్న బస్సుయాత్రల్లో కూడా చెబుతున్న మాట… కొత్త రాజకీయాలు చేస్తామనీ, ఒకసారి అవకాశం ఇవ్వాలని కూడా అన్నారు. ప్రకటనల్నీ ఈ తరహాలో ఉంటున్నాయి. కానీ, ప్రస్తుతం వరుసగా పార్టీలో చేరుతున్న, చేర్చుకుంటున్న నేతలను చూస్తుంటే… కొత్త రక్తం అనేది వచ్చి చేరుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
నిజానికి, తొలివిడత పవన్ యాత్రలో నేతల చేరికపై పెద్దగా దృష్టిపెట్లేదు. కానీ, ఇప్పుడు వరుసగా నేతల్ని చేర్చుకుంటున్నారు. విశాఖ నుంచి టీడీపీలో అవకాశం కోసం కొన్నేళ్లుగా వెయిట్ చేసిన కోన తాతారావు జనసేనలో చేరారు. అదే ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, మాజీ కాంగ్రెస్ నేత సతీష్ చేరారు. వీరితోపాటు గతంలో కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత తగ్గిన కొందరూ జనసేన పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం. ఒకప్పటి సీనియర్ నేత దాడి వీరభద్రరావుని కూడా జనసేనలోకి ఆహ్వానించే అవకాశం కనిస్తోంది. వైకాపా నుంచి దూరమయ్యాక ఆయన తటస్థంగా ఉంటున్నారు. చోడవరం నుంచి మరో మాజీ వైకాపా నేతల వి.వి.ఎస్.ఎన్. రాజు కూడా చేరబోతున్నట్టు సమాచారం. మొత్తానికి, ఉత్తరాంధ్ర పర్యటన ముగిసేలోపు చేరికల జోరు పవన్ పెంచుతున్నారు.
ఇప్పుడు చేర్చుకున్నవారందరికీ వచ్చే ఎన్నికల్లో జనసేన తరఫున టిక్కెట్లు ఇస్తారా ఇవ్వరా అనేది ప్రస్తుతానికి చర్చ కాకపోయినా… వీరిలో సీనియర్లు టిక్కెట్లు ఆశించే కదా చేరతారు! మరి, కొత్త తరానికే పార్టీలో ప్రాధాన్యత అని చెప్తూ… ఇలా రాజకీయాలకు దూరంగా ఉంటూ, పార్టీలు మారీమారీ చివరికి ఖాళీగా ఉంటున్న నాయకుల్ని ఏరికోరి చేర్చుకోవడం వల్ల జనసేనకు ‘కొత్త తరహా రాజకీయం’ అనే బ్రాండ్ ఇమేజ్ ఎలా వస్తుంది..? అనుభవం ఉన్న నేతలూ అవసరమే. కానీ, కొత్తతరం నేతల్ని కూడా వీరితోపాటు చేర్చుకుంటూ పోతే ఇమేజ్ ఇంకోలా కనిపిస్తుంది. జనసేనకు ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా కావాలి. కానీ, నాయకులు అంటే ఇతర పార్టీల్లో మాత్రమే ఉండరు కదా! ఇతర రంగాలపై కూడా దృష్టి పెట్టి, ప్రజలకు అందుబాటులో ఉంటూ, వివిధ మార్గాల ద్వారా ప్రజాసేవ చేస్తున్నవారికి గుర్తించి ఆహ్వానిస్తే… అది కొత్త రక్తమౌతుంది. అంతేగానీ… ఇలా చేర్చుకుంటూ పోతే, రేప్పొద్దున్న టీడీపీ, వైకాపాల్లో టిక్కెట్లు దక్కనివారి మూడో ఆప్షన్ గా జనసేన మారే అవకాశం ఉంటుంది. చేరికల విషయంలో పవన్ కల్యాణ్ కాస్త హడావుడి పడుతున్నారేమో అని అభిప్రాయమూ కొంత వ్యక్తమౌతోంది.