టెన్త్ ఫలితాలపై ప్రభుత్వాన్ని వైసీపీ నేత దాడి వీరభద్రరావు తప్పు పట్టడం చర్చనీయాంశమవుతోంది. టెన్త్ ఫలితాలపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను వైసీపీ నేతలు గట్టిగా ఖండిస్తున్నారు. పిల్లలు సరిగ్గా చదవలేదని.. వారి తల్లిదండ్రులదే తప్పంటున్నారు లోకేష్ ఫెయిలయిన విద్యార్థులతో ముఖాముఖి పెడితే తీవ్ర విమర్శలు చేశారు. జూమ్ మీటింగ్‌లోకి చొరబడి రచ్చ చేశారు. ఇప్పుడు వైసీపీకే చెందిన కీలక నేత దాడి వీరభద్రరావు ప్రభుత్వానిదే తప్పని మీడియా ముందుకు వచ్చారు.
పవన్ కల్యాణ్ డిమాండ్ చేసినట్లుగానే పది ఫెయిల్ అయిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపాలని ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో దాడి వీరభద్రరావు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. గత పది సంవత్సరాలలో 83 శాతం కన్నా తక్కువ ఫలితాలు ఎప్పుడు రాలేదని, 67.26 శాతం విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించడం పట్ల ఒక అధ్యాపకుడిగా చాలా బాధపడుతున్నానన్నారు. పరీక్ష విధానం మోడల్ పేపర్ ముందుగా విడుదల చేయకపోవడం ఉత్తీర్ణత శాతం తగ్గడానికి ఒక కారణమని చెప్పారు.
అంటే ప్రభుత్వానికే తప్పని దాడి వీరభద్రరావు నేరుగా చెబుతున్నారన్నమాట. ఇటీవలి కాలంలో తనకు పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదని.. ఆయన అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో టెన్త్ ఫలితాలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం.. పవన్ కల్యాణ్ వాదనను సమర్థించడం ఆసక్తి రేపుతోంది.