మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన ఇంటికి వెళ్లి పవన్ కల్యాణ్ జనసేనలో చేరాలని ఆహ్వానించారు. అనుచరులతో మాట్లాడి చెబుతానని దాడి వీరభద్రరావు పవన్ కు చెప్పారు. ఆ తర్వాత సైలెంటయిపోయారు. కానీ టీడీపీలో చేరేందుకు మాత్రం ప్రయత్నాలు కొనసాగించారు. పవన్ కల్యాణ్ తన ఇంటికి వచ్చిన తర్వాత ఎపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావుకు దాడి వీరభద్రరావు ఫోన్ చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరిచారు. ఇదే విషయాన్ని తన మాటగా పార్టీ అధినేత చంద్రబాబుకు చెప్పాలని దాడి వీరభద్రరావు కోరారు.
దాడి వీరభద్రరావు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న నేత. గత ఎన్నికలకు ముందు వరకూ ఎమ్మెల్సీగా ఉన్నారు. మళ్లీ తనకు ఎమ్మెల్సీ పొడిగింపు ఇస్తారని భావించారు. కానీ చంద్రబాబు యనమల రామకృష్ణుడికి అవకాశం ఇచ్చారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీకి ాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. అక్కడ ఆయనకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఆయన కుమారుడికి జగన్ టిక్కెట్ ఇచ్చినా ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో ఇమడలేక బయటకు వచ్చేశారు. టీడీపీ అధినేత ఆహ్వానిస్తే పార్టీలో చేరుతానని… గతంలో ఓ సందర్భంలో ప్రకటించారు కూడా. ప్రస్తుతం తటస్థంగా ఉన్న దాడి స్వగృహప్రవేశానికి లైన్ క్లియర్ అయింది.
దాడి వీరభద్రరావును టీడీపీలో చేర్చుకోవడానికి చంద్రబాబు అంగీకరించారు.అయితే టిక్కెట్ల హామీలేమీ లేకుండా.. పార్టీలో పని చేసుకునేవిధంగా అయితేనేనని షరతు పెట్టారు. ఇదే విషయాన్ని కళా వెంకట్రావు.. దాడి వీరభద్రరరావుకు స్పష్టం చేశారు. దానికి దాడి వీరభద్రరావు అంగీకరించారు. మంచి ముహుర్తం చూసుకుని ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు, ఉత్తరాంధ్రకు చెందిన మరో నేత కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తిని కనబరుస్తున్నప్పటికీ చంద్రబాబు నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించలేదు. కొంత మంది పార్టీ నేతలు అడ్డుపడుతూండటంతో సమీకరణాలు కుదరడం లేదు.