దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. వైసీపీ గూటికి చేరబోతున్నారు. ఆయన లోటస్పాండ్లో వైసీపీ అధినేతతో సమావేశమయ్యారు. ఆయన వెంట కుమారుడు హితేష్ చెంచురామ్ ఉన్నారు. కొద్ది రోజులుగా.. ఆయన పర్చూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా కుమారుడ్ని బరిలోకి దించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు….సర్వేలు చేయించుకున్నారు. వైసీపీ నేతలతో మాట్లాడారు. చివరికి.. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. పర్చూరు నుంచి గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగోలేకపోవడంతో పోటీ చేయలేదు. ఈ సారి కుమారుడికి రాజకీయ భవిష్యత్ కల్పించాలనుకున్నారు. దానికి వైసీపీనే మంచి ఫ్లాట్ ఫాంగా నిర్ణయించుకున్నారు.
పదిహేనేళ్ల కిందట.. దుగ్గుబాటి దంపతులు కాంగ్రెస్ లో చేరారు. దుగ్గుబాటి పురందేశ్వరి ఓ సారి బాపట్ల నుంచి .. మరోసారి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కేంద్రమంత్రిగా పని చేశారు. పర్చూరు నుంచి రెండు సార్లు దగ్గబాటి వెంకటేశ్వరరావు విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత.. పురందేశ్వరి బీజేపీలో చేరిపోయారు. వెంకటేశ్వరరావు మాత్రం ఏ పార్టీలో చేరకుండా ఉండిపోయారు. గత ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో.. పురందేశ్వరికి రాజంపేట పార్లమెంట్ టిక్కెట్ లభించింది. విశాఖ సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికి.. బీజేపీ నేతలు.. అక్కడ ఏపీ బీజేపీ అధ్యక్షునిగా హరిబాబుకు చాన్సిచ్చారు. రాజంపేటలో పురందేశ్వరికి విజయం దక్కలేదు. అయినప్పటికీ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో.. పురందేశ్వరి చురుగ్గానే ఉన్నారు.
బీజేపీ తరపున పోటీ చేస్తే డిపాజిట్లు రావడం కూడా కష్టమే కాబట్టి… వైసీపీలో చేరాలని.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిర్ణయించుకున్నారు. హితేష్ చెంచురామ్తో పోటీ చేయించాలనుకున్నప్పటికీ.. ఆయనకు పౌరసత్వ పరంగా కొన్ని సమస్యలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అమెరికా పౌరసత్వం కోసం హితేష్ ధరఖాస్తు చేసుకున్నారని .. అందువల్ల ఆయన పోటీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. ఒక వేళ హితేష్ కాకపోతే.. దగ్గుబాటే పోటీ చేసే అవకాశం ఉంది. దగ్గుబాటి కొంత కాలం నుంచి ఆయన వైసీపీకి అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నారు. భర్త, కుమారుడు.. వైసీపీలో చేరినప్పటికీ.. పురందేశ్వరి మాత్రం బీజేపీలోనే కొనసాగనుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే.. ఏపీలో ఉన్న సీనియర్ లీడర్లలో ఒకరిగా ఆమెకు ఏదైనా పదవి దక్కుతుందన్న అంచనాతో.. ఆమె మాత్రం… బీజేపీలోనే కొనసాగుతుందని చెబుతున్నారు.