కుమారుడికి రాజకీయ భవిష్యత్ కోసం అమెరికా పౌరసత్వాన్ని కూడా క్యాన్సిల్ చేయించుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇప్పుడు మనసు మార్చుకున్నారు. దేవుడి చెప్పినట్లుగానే భావిస్తున్నామని చెప్పి. తాను .. తన కుమారుడు రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రకటించారు. పర్చూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనే ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే ఆయన రాజకీయంగా రిటైర్మెంట్ గురించి అందరూ ఊహించినప్పటికీ.. అనూహ్యంగా ఆయన కుమారుడు హితేష్ కూడా ఇక రాజకీయాల్లో ఉండరని చెప్పడం ఆశ్చర్యకరంగా మారింది.
గత ఎన్నికల్లో వైసీపీ తరపున హితేష్ ను పర్చూరు నుంచి బరిలోకి దింపాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు .జగన్ కూడా టిక్కెట్ ఖరారు చేశారు. అయితే ఆయన అమెరికా పౌరసత్వం రద్దు కాకపోవడంతో చివరి క్షణంలో దగ్గుబాటినే పోటీ చేయాల్సివచ్చింది. అప్పట్లో తప్పిపోయినా కొంత కాలం వైసీపీ కోసం హితేష్ పర్చూరులో పని చేశారు. కానీ పురందేశ్వరి కూడా వైసీపీలోకి రావాలని లేకపోతే మీరు పార్టీ నుంచి వెళ్లిపోవాలని జగన్ సూచించడంతో వారు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు పూర్తిగా రాజకీయాలకు దూరం అయ్యారు.
పురందేశ్వరి బీజేపీ తరపున రాజకీయాల్లో ఉన్నారు. ఆమె టీడీపీలోకి వచ్చే అవకాశం లేదు. దగ్గుబాటి కుమారుడికి చీరాల టీడీపీ టిక్కెట్ కేటాయిస్తారని కొంత కాలంగా ప్రచారం ఉంది. కానీ ఇప్పుడు దగ్గుబాటి రాజకీయ విరమణ ప్రకటించడంతో అలాంటి చాన్స్ కూడా లేదని తేలిపోయింది. పురందేశ్వరి బీజేపీలోనే ఉంటారని…అంటున్నారు. ఒకప్పుడు చంద్రబాబుతో పోటీగా రాజకీయం చేసిన దగ్గుబాటి.. తర్వాత ఆయనకు దూరమయ్యారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పుస్తకాలు కూడా రాశారు. ఇప్పుడు రాజకీయ విరమణ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.