రాజకీయ ఇంకా చెప్పాలంటే అధికార కుటుంబాలలో అంతర్గత విషయాలు అంతగా బయిటకు రావు. రానివ్వకుండా జాగ్రత్త పడుతుంటారు కూడా. రాజకీయంగా వివాదపడినా సరే నోరు విప్పి ఒకరిపై ఒకరు చెప్పుకోరు. అయితే మాజీ కేంద్ర మంత్రి, బిజెపి నేత దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం తన చెల్లెలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై నేరుగానే వ్యాఖ్యలు చేశారు. తమ మధ్య సంబంధాలలో ఉద్రిక్తలను అంగీకరించారు. తన భర్త డా.దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒక పార్టీలోభువనేశ్వరి భర్త చంద్రబాబు మరో పార్టీలో వుండటం వల్ల సహజంగానే వ్యక్తిగత సంబంధాలలో ఒక అసౌకర్యం వుంటుందని ఒక ఇంటర్వ్యూలో సూటిగానే చెప్పారు. వాస్తవం ఏమంటే భర్తలిద్దరూ ఒకే పార్టీలో వున్నప్పుడు కూడా ఈ రెండు కుటుంబాల మధ్య ఎప్పుడూ సత్పంబంధాలు వుండేవి కావట. దగ్గుబాటి చంద్రబాబు ఎప్పుడూ భిన్న ధృవాలే. అయితే ఎన్టీఆర్‌పై తిరుగుబాటులో మాత్రం ఈ ఇద్దరూ కలవడమే గాక ఆయన కుమారులైన హరికృష్ణ, బాలకృష్ణ వంటివారిని కూడా తమ వైపు తిప్పుకోగలిగారు. కొద్ది కాలంలోనే తోడళ్లుళ్లు విడిపోయారు. అయితే ఈ తిరుగుబాటులో పురంధేశ్వరి పాత్ర వుందా లేదా అంటే ఖచ్చితంగా వుందని చంద్రబాబు శిబిరం వాదిస్తుంది. లక్ష్మీ పార్వతి ఉనికిని సహించలేక మొదట తిరుగుబాటుకు ప్రోద్వలం ఇచ్చింది పురంధేశ్వరేనని వారంటుంటారు. ఆ రోజు ఆమె రెచ్చగొట్టేట్టు కూడా మాట్లాడారట. అప్పుడు భువనేశ్వరి బ, పురంధేశ్వరి కూడా రాజకీయాల్లో లేరు. కేవలం కుటుంబ కలహంలాగే ఇదంతా నడపించారు. తర్వాత ఆమె కాంగ్రెస్‌లో చేరి కేంద్రమంత్రిగా రాణించారు. కాని 2014 లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి ఆమె సిట్టింగ్ స్థానం విశాఖలో పోటీచేయనీకుండా మిత్రపక్షంగా వున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డారనేది వారి ఆరోపణ. ఎలాగూ ఓడిపోతానని తెలిసే ఆమె రాజంపేట వెళ్లారు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు బిజెపిలో కూడా తన పెరుగుదలకు చంద్రబాబు అడ్డుపడుతున్నారనే ఆరోపణ వుంది. ఇక పోతే భువనేశ్వరి భర్త ముఖ్యమంత్రిగా వున్నారు గనక ఆమె ప్రాబల్యం పెరిగిపోయింది. లోకేశ్‌ను కాస్త ఆలస్యంగా మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకున్నా రోజూ వెంటబడి మనశ్శాంతి కూడా లేకుండా చేసినట్టు కొందరు చెబుతుంటారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో విజయమ్మ కూడా ఇలాగే చక్రం తిప్పిన సందర్భాలున్నాయి.బహుశా ఇవన్నీ తట్టుకోలేకే పురంధేశ్వరి బయిటపడి మాట్లాడారేమో!! ఏదైనా ఆమెకిది నిరీక్షణ కాలమే.