జేపీ నడ్డా పదవీ కాలం ముగియడంతో చాలా రోజులుగా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిపై ఆ పార్టీ అగ్రనేతలు కసరత్తు చేస్తున్నారు. అనేక సమీకరణాలు పరిశీలించిన తర్వాత ఈ సారి దక్షిణాదికి.. మహిళా నేతకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రైటీరియా ప్రకారం చూస్తే.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, తమిళనాడు నేత వానతి శ్రీనివాసన్ పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లుగా జాతీయ మీడియా వర్గాలు ప్రకటిస్తున్నాయి.
వానతి శ్రీనివాసన్ తమిళనాడులో కీలక నేతగా ఉన్నారు. దూకుడుగా వ్యవహరిస్తారన్న పేరు ఉంది. కోయంబత్తూరు సౌత్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె చాలా కాలంగా బీజేపీలోనే ఉన్నారు. తమిళనాడును రెండుగా విభజించి కొంగునాడు ఏర్పాటు చేయాలని బలంగా వాదిస్తూ ఉంటారు. పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీలో పదేళ్లు కేంద్ర మంత్రిగా చేసి ఆ తర్వాత పార్టీ మారారు. పార్టీ అధ్యక్షురాలిగా .. బయట నుంచి వచ్చిన వారికి అవకాశం ఇవ్వకూడదని అనుకుంటే ఆమె పేరును పక్కన పెట్టే అవకాశం ఉంది.బీజేపీ రాజకీయాలను రాజకీయాల్లాగే చేస్తుందన్న సంకేతాలను పంపాలనుకుంటే పురందేశ్వరిని అధ్యక్షురాలిగా చేసే అవకాశం ఉంది.
బీజేపీ ఆధ్యక్షుడిగా ఎవరున్నా.. పార్టీ నిర్ణయాలన్నీ మోదీ, అమిత్ షా చూసుకుంటారు. అమిత్ షా రెండు సార్లు బీజేపీ అధ్యక్షుడిగా చేసిన తర్వాత .. ఆ పార్టీ నిబంధనలు అంగీకరించవు కాబట్టి ఆయన అధ్యక్షుడిగా వైదొలిగారు. అయితే తర్వాత వచ్చిన అధ్యక్షులు ఆయన కనుసన్నల్లోనే పని చేస్తూ పార్టీని నడిపిస్తున్నారు. కొత్తగా ఈ సారి దక్షిణాది నుంచి అధ్యక్షుడిని ఎన్నిక చేసుకోవాలనుకోవడమే వారి రాజకీయ వ్యూహం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. డీ లిమిటేషన్ తో పాటు ఇతర అంశాల్లో.. దక్షిణాదిలో అసంతృప్తి రేగకుండా చర్యలు తీసుకుంటున్నారు.