మాజీ మంత్రి దుగ్గుబాటి వెంకటేశ్వరరావును వైసీపీ అధినేత జగన్ రెడ్డి అవమానకరంగా పార్టీ నుంచి బయటకు పంపేశారని చాలా మందికి తెలుసు. అయితే అంతకు ముందు జరిగిన విషయాలను దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరు ప్రజల ముందు ఉంచారు. చాలా రోజుల తర్వాతా ఆయన నియోజకవర్గంలో ఓ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్నికల తర్వాత జగన్ తనను పిలిచారని, తన కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని చెప్పారని దగ్గుబాటి వెంకటేశ్వర రావు అన్నారు.
ఆయన పెట్టిన నిబంధనలకు తాను ఒప్పుకోలేదని చెప్పారు. ఆయన పెట్టిన నిబంధనలు ఏమిటంటే.. పురందేశ్వరిని కూడా బీజేపీకి రాజీనామా చేసి.. వైసీపీలో చేరడం. ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉండవద్దని.. వైసీపీలో చేరేలా పురందేశ్వరిని ఒప్పించాలని ఒత్తిడి చేశారు. అయితే దగ్గుబాటి మాత్రం తన కుమారుడికి ఎమ్మెల్సీ వద్దు.. మంత్రి పదవి వద్దు అని తిరస్కరించారు. ఎందుకంటే.. జగన్ రెడ్డి సంగతి ఆయనకు బాగా తెలుసు. అదే సమయంలో తాను పర్చూరులో ఓడిపోవడం మంచిదయిందన్నారు. అదే గెలిచి ఉంటే.. ఇప్పుడు పనులు చేయడం లేని ప్రజలు తన చొక్కా పట్టుకునేవారన్నారు.
కారంచేడులో రోడ్లు వేయలేదని ప్రజలు అంటున్నారని దగ్గుబాటి వెంకటేశ్వర రావు చెప్పారు. గత ఎన్నికల్లో తాను గెలిస్తే ప్రస్తుత పరిస్తితుల్లో ఈ రోడ్ల మీద ఇంత స్వేచ్ఛగా తిరగలేకపోయేవాడినని అన్నారు. దేవుడి దయవల్ల పర్చూరులో తాను ఓడిపోవడమే మంచిదైందని చెప్పారు. దగ్గుబాటి వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.