ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర్రావు. తన తోడల్లుడు ఒక వింత జాతికి చెందిన వ్యక్తి అన్నారు! ఆయన ముఖ్యమంత్రి అయ్యారని తనకు ఈర్ష్య, అసూయతో ఉన్నాయని చంద్రబాబు అంటున్నారనీ, కానీ గత ఐదేళ్లుగా తాను చాలా ఆనందంగా ఉన్నా అన్నారు. తనకు చంద్రబాబు మీద జాలి ఉందన్నారు. ఆయన ముఖ్యమంత్రి సీట్లో ఉండొచ్చేమోగానీ, తనలా ఆనందంగా ఆయన ఉండలేడన్నారు. ఆయన ఆనందంతో ఉండలేని మనిషి అన్నారు. పూటకో మాట మార్చే స్వభావం ఆయనకి ఉందనీ, సోషల్ మీడియాలో ఆయన మీద వస్తున్న కామెంట్లు, విమర్శలు అన్నీఇన్నీ కావన్నారు దగ్గుబాటి. తానైతే వాటిని భరించలేననీ, ముఖ్యమంత్రి సీట్లో గంటైనా తాను కూర్చోలేను అన్నారు.
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ఆయన పనిగా పెట్టుకున్నారనీ, ఇంటెలిజెన్స్ ఐజీకి ఆ బాధ్యతల్ని అప్పగించారని దగ్గుబాటి ఆరోపించారు. వైకాపాలో ఉన్న అసంతృప్త నేతలకు కాంట్రాక్టులు కట్టబెడతామంటూ ఎర వేస్తున్నారనీ, నాయకుల కొనుగోలు కోసం చేసే బేరసారాల్లో పోలీసు ఉన్నతాధికారి జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. గతంలో పోలవరం ప్రాజెక్టును ఆయన వద్దన్నారనీ, ఇప్పుడు కేంద్రం నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టు క్రెడిట్ తనకు దక్కాలని ప్రయత్నిస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో జరుగుతున్న తంతు అంతా మాయాజాలమనీ, గ్రాఫిక్స్ లో తప్ప, అమరావతిలో ఏమీ లేదన్నారు. రాజధాని డిజైన్లను ఎంపిక చేయడానికి ఆయనకి నాలుగేళ్లు పట్టిందని దగ్గుబాటి ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో అన్ని రకాల వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయన్నారు.
దగ్గుబాటి ఇప్పుడు వైకాపా తరఫున మాట్లాడుతున్నారని తెలిసిందే. ఆ పార్టీలోకి వెళ్లగానే… పోలీస్ వ్యవస్థ నుంచి రాష్ట్రంలో అన్నీ బ్రష్టుపట్టినట్టుగానే కనిపించడం సహజం! ఆధారాలతో పనిలేకుండా ఆరోపణలు చేసేయడం కూడా అంతే సహజమేమో! కేవలం గ్రాఫిక్స్ లో మాత్రమే అమరావతి ఉందనడమూ వైకాపా నేతలు చేసే మరో రొటీన్ విమర్శ. వాస్తవాలతోగానీ, ఆధారాలతోగానీ ఏమాత్రం పనిలేకుండా… చేయాల్సిన విమర్శలు, ఆరోపణలు ఇవీ అనే రూల్ ఏదైనా వైకాపా దగ్గర ఉన్నట్టుంది! తాజా నేత దగ్గుబాటి కూడా దాన్ని ఫాలో అయిపోతున్నట్టున్నారు. నిజానికి, రాష్ట్రమ్మీద అంత ప్రేమ ఉంటే… పోలవరం గురించిగానీ, రాష్ట్ర ప్రయోజనాల గురించి గడచిన ఐదేళ్లలో దగ్గుబాటి మాట్లాడిన సందర్భాలుండాలిగా, ఉన్నాయా?