ప్రకాశం జిల్లా పర్చూరులో వైసీపీ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావే బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన కుమారుడు హితేష్ చెంచురాం రాజకీయ భవిష్యత్ కోసం.. ఆ పార్టీలో చేరారు. అయితే.. హితేష్ అమెరికా పౌరుడు. ఆ పౌరసత్వాన్ని రద్దు చేసుకోవడానికి ఇప్పటి వరకూ చాలా ప్రయత్నించారు. కానీ ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. దాంతో.. నామినేషన్ల సమయానికి సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చారు. దాంతో.. దగ్గుబాటి వెంకటేశ్వరరావునే రంగంలోకి దిగాలని జగన్ సూచించినట్లు చెబుతున్నారు. దానికి దగ్గుబాటి స్పందన ఎలా ఉంటుందో ఇంత వరకూ బయటకు రాలేదు.
వాస్తవానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. వైసీపీలో చేరలేదు. ఉండవల్లిలో జరిగిన జగన్ గృహప్రవేశ కార్యక్రమం తర్వాత పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ సమంయలో… దగ్గుబాటి హితేష్ చెంచురాం, ఆమంచి కృష్ణమోహన్ పార్టీలో చేరారు. దగ్గుబాటికి కూడా.. కండువా కప్పాలని జగన్ ప్రయత్నించారు. కానీ దగ్గుబాటి దూరం జరిగి.. తన కుమారుడ్ని మాత్రమే… పంపారు. ఇది అప్పట్లో చర్చనీయాంశం అయింది. జగన్ మీడియా కూడా.. దగ్గుబాటి హితేష్ చెంచురాం మాత్రమే… వైసీపీలో చేరారని చెప్పుకొచ్చింది కానీ.. దగ్గుబాటి గురించి రాయలేదు.
ఇప్పుడు పరిస్థితులు తారు మారవడంతో.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రంగంలోకి దిగక తప్పడం లేదని చెబుతున్నారు. పర్చూరు నుంచి గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు కాబట్టి.. ఆయన అయితే.. విజయం సులువు అవుతుందని వైసీపీ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. అయితే దగ్గుబాటి.. పార్టీ కండువా కప్పించుకోవడానికి కూడా మొహమాట పడ్డారు. మరి ఆ పార్టీలో చేరుతారా.. అనేది… ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. అయితే.. ఆయన అధికారికంగా చేరకపోయినా… చేరినట్లే కాబట్టి… పోటీ చేస్తారని.. వైసీపీ వర్గాలు ధీమాగా ఉన్నాయి.