అధికార పార్టీ వైకాపా నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు సొంత పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ అధినాయకత్వం తీరుపై ఆయన అసంతృప్తిగా ఉండటమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఇదే అంశమై గత కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. దీనిపై అభిమానులు, కార్యకర్తలతో శనివారం సాయంత్రం ఆయన చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టుగా స్పష్టంగా ప్రకటించకపోయినా… ఇకపై తనను కలిసేందుకు ఎవ్వరూ రావొద్దంటూ వైకాపా కార్యకర్తలకు దగ్గుబాటి చెప్పినట్టుగా సమాచారం. దానర్థం అదే కదా!
గత ఎన్నికల్లో పర్చూరు నుంచి పోటీ చేసి దగ్గుబాటి ఓడిపోయారు. ఆయన భార్య, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి భాజపా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఉన్నారు. సీఎం జగన్ తో ఆయనకి సమస్య ఇక్కడుంది! దగ్గుబాటికి పొగ పెట్టడానికి ఓరకంగా భాజపా నాయకురాలిగా పురందేశ్వరి క్రియాశీలంగా ఉండటమే కారణం అనాలి! జగన్ సర్కారుపై ఆమె తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని విషయంలో కూడా జగన్ సర్కారు అనుసరిస్తున్న వైఖరిని ఆమె తప్పుబడుతున్నారు. దీంతో, భర్త వైకాపాలో భార్య భాజపాలో ఉంటే కుదరదనీ, ఇద్దరూ ఒకే పార్టీలో ఉండాలంటూ ఆ మధ్య జగన్ చెప్పేశారట! దీంతో పురందేశ్వరిని కూడా వైకాపాలోకి వచ్చేలా చేయాలనీ, ఆమెకి పార్టీలో మంచి గుర్తింపు ఇస్తామనీ, రాజ్యసభకు పంపిస్తామని కూడా హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది.
భాజపాని వీడేందుకు పురందేశ్వరి సిద్ధంగా లేరనీ, దాంతో ఆమె వెంటే ఉండేందుకు దగ్గుబాటి కూడా నిర్ణయించుకున్నారనీ, ఈ నేపథ్యంలోనే ఒక నిర్ణయం తీసుకుని, ముఖ్యమంత్రి జగన్ ని త్వరలోనే లాంఛనంగా కలిసి పార్టీకి గుడ్ బై చెప్పేయబోతున్నారని తెలుస్తోంది. భర్త ఒక పార్టీలో, భార్య వేరే పార్టీలో ఉండకూదన్నట్టుగా చెప్పడమేంటి..? అలాంటి రూల్స్ ఏమైనా ఉన్నాయా..? కేవలం తనపై వినిపిస్తున్న వ్యక్తిగత విమర్శల నోరు నొక్కాలన్న ఉద్దేశమే దగ్గుబాటిపై అధికార పార్టీ ఒత్తిడి పెంచడం వెనక కనిపిస్తోంది. ఇది కేవలం ఇగోకి సంబంధించిన అంశమే అనడంలో సందేహం లేదు. ఇంకోటి… ఇప్పుడు దగ్గుబాటిని పొగబెట్టి బయటకి పంపేస్తే… వైకాపాకి ఏంటి లాభం..? తీవ్రంగా విమర్శించే మరో స్వరాన్ని పెంచుకున్నట్టే అవుతుంది కదా! అయినా… భాజపా కేంద్రంలో తిరుగులేని అధికారంలో ఉంది! అలాంటి పార్టీలో ఉన్న పురందేశ్వరిని వైకాపాలోకి వచ్చి చేరండీ అంటే… ఆమె ఎలా చేరతారు? ఆమెని వైకాపాలోకి చేర్చే ప్రయత్నం చేయండీ అంటే దగ్గుబాటి కూడా ఎందుకు చేస్తారు..?