కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మధ్య రాజకీయ వైరుధ్యాలతో పాటు కుటుంబ వైరాలు కూడా ఒకపట్టాన ముగిసేవి కావు. ఎన్టీఆర్ కుమార్తెగా వుండి కాంగ్రెస్లో చేరి మంత్రి అయ్యారనేది ఆమెపై తెలుగుదేశం వారి ప్రధాన విమర్శ. ఇది నిజమైన తెలుగుదేశం కాదు అనేది ఆ రోజుల్లో ఆమె సమాధానం. మానాన్నకు వెన్నుపోటు పొడిచారని ఆమె అన్నప్పుడు మీరు కూడా అందులో భాగస్వాములేనన్నది వారి ప్రతి విమర్శ. అలాటి వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు జోక్యం చేసుకుని పురంధేశ్వరికి తమ తిరుగుబాటుకు సంబంధం లేదని సమర్థించారు. అయితే ఎన్టీఆర్ రెండవ వివాహంపై అందరికన్నా ఎక్కువగా ఆగ్రహించి అందరినీ కదిలించింది ఆమేనన్నది చంద్రబాబు యథాలాపంగా అనడమే కాదు, ఆ కుటుంబానికి సన్నిహితులైన చాలా మంది చెబుతుంటారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని నేను గౌరవిస్తాను గాని నందమూరి వంశం అంటే అందరినీ అకామిడేట్ చేయడం నావల్ల కాదనేది చంద్రబాబు వాదన. ఏమైతేనేం- ఆమె కాంగ్రెస్లో వున్నన్ని రోజులు ఆయన ప్రతిపక్షంలో వున్నారు. ఆమె కేంద్రంలో ఈయన రాష్ట్రంలో గనక సమస్యలేమీ రాలేదు.రోశయ్య తర్వాత ముఖ్యమంత్రి అయ్యే పేర్లలో పురంధేశ్వరి పేరు కూడా వినిపించింది. అది పెద్దగా సాధ్యం కాదని నేను అనుకున్నాను. అయితే ఎన్టీఆర్ కూతురు అనే సెంటిమెంటుతో పాటు సామాజిక కోణంలోనూ కాంగ్రెస్ అధిష్టానం అలాటి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా వుంటుందని చంద్రబాబు జాగ్రత్తగానే పరిశీలిస్తూవున్నట్టు కనిపించింది. కాంగ్రెస్ అధినేతలకు ఇక్కడి విషయాలతో ప్రత్యక్ష పరిచయం వుండదు గనక ఇలాటి ప్రయోగాలు ప్రతిపాదిస్తే నమ్మేస్తుంటారని ఆయన కొంత వరకూ అనుకున్నారు గాని కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు. ఆ రోజుల్లో సోనియా గాంధీ పురంధేశ్వరి ద్వారానే ముఖ్య విషయాలు బయిటకు చెప్పిన సందర్భాలు కొన్ని వున్నాయి. ముఖ్యంగా జగన్ ఓదార్పు యాత్రపై సోనియా ఉద్దేశాలు పురంధేశ్వరి తొలిసారి లోకానికి వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ కాలంలోనూ చాలాసార్లు ఆమెనే మాట్లాడేవారు. చివరి వరకూ కాంగ్రెస్లో వుండి ఆఖరు దశలో బిజెపిలో చేరారు. విశాఖ నుంచి ఆమె పోటీ చేయాలని గట్టిగా భావించినా చంద్రబాబు పడనీయలేదని అంటారు. రాజంపేటలో పోటీచేసి ఓడిపోయారు. ప్రత్యేక హౌదాపైన గాని,ఇచ్చిన దానికి లెక్కలు చెప్పలేదన్న ఆరోపణలు గాని ఎక్కువగా ఆమె చేస్తుంటారు. వాటిపై తెలుగుదేశం నేతలు మొదట తీవ్రంగా స్పందించినా చంద్రబాబు కొంత వారించినట్టు కనిపిస్తుంది. అయితే ఇటీవల మళ్లీ అమరావతిలో ఏం జరుగుతుందో మాకు తెలియడం లేదని పురంధేశ్వరి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వాటికి తనుగా ఎలాగూ జవాబు చెప్పరు. ఇలాగే జరిగితే ముందు ముందు వీరిద్దరి పాత వైరాలు మళ్లీ ముందుకు రావచ్చునేమో.స్వంతంగా ఎదగాలన్న బిజెపి వ్యూహాన్ని తన వ్యక్తిగత ఎజెండాను మిళితం చేసే అవకాశం ఆమెకు లభిస్తుంది. చంద్రబాబు మరీ అవసరమైతే బిజెపి కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేయవచ్చుగాని వారి ద్వంద్వనీతి ఫలితంగానే ఆమెకు ఆ అవకాశం వస్తుందనేది అసలు నిజం. ఇదో కుటుంబ కమ్ రాజకీయ కమ్ ప్రభుత్వ కలహం.