లాక్ డౌన్ వేళ… దిన పత్రికల రాక కూడా అనుమానంగా మారింది. కాగితాల ద్వారా వైరస్ తేలిగ్గా, త్వరగా సంక్రమించే అవకాశం ఉందన్న పుకార్లు రావడం, సర్క్యులేషన్ తగ్గిపోవడం, యాడ్ల ద్వారా వచ్చే సంపద ఆవిరైపోవడం, ఉద్యోగుల భద్రత.. వీటన్నింటి దృష్ట్యా.. ఏప్రిల్ 14 వరకూ దిన పత్రికల్నీ మూసేయాలని యాజమాన్యాలన్నీ మూకుమ్మడిగా భావించినా, రామోజీ రావు మాత్రం `నో`చెప్పడంతో దిన పత్రికలు లాక్ డౌన్‌ని విరమించాయని టాక్.
ఇటీవలే ప్రధాన పత్రికలకు సంబంధించిన ప్రముఖులు ఓ వీడియో కాన్ఫిరెన్స్ ఏర్పాటు చేసుకున్నారు. రామోజీరావు, రాధాకృష్ణ, భారతి… వీళ్లంతా ఈ వీడియో కాన్ఫిరెన్స్‌లో పాలుపంచుకున్నారు. ఇలాంటి సమయంలో పత్రికల్ని నడపడం అవసరమా? ఏప్రిల్ 14 వరకూ ప్రింటింగ్ ఆపేస్తే వచ్చే లాభనష్టాలేమిటి? అనేది ప్రధాన పత్రికల యజమానులు బేరీజు వేసుకున్నారు. ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సాక్షి.. ఇవన్నీ తాత్కాలికంగా తమ పత్రికల్ని మూసివేయడానికి అంగీకరించాయి. కానీ ఈనాడు మాత్రం ససేమీరా అనడంతో వాళ్లందరి నిర్ణయాలూ ప్రభావితమయ్యాయని టాక్. ఈనాడు అధినేత రామోజీ రావు మాత్రం ప్రింటింగ్ ఆపడానికి ఏమాత్రం ఇష్టపడలేదని తెలుస్తోంది. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం తగ్గినా సరే, ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రింటింగ్ ఆపకూడదని, అది రాబోయే రోజుల్లో దిన పత్రిక మనుగడకే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని రామోజీ హెచ్చరించారని తెలుస్తోంది. ఈనాడు నిర్ణయానికే సాక్షి కూడా ఓటేయడంతో… యాజమానులంతా వెనక్కి తగ్గారు. ఒకవేళ రామోజీ గనుక లాక్‌డౌన్‌కి ఓకే అంటే.. తెలుగునాట పత్రికలన్నీ ఇప్పుడు తాత్కాలికంగా మూతపడేవి. రామోజీ ప్రతిపాదన మేరకే.. దిన పత్రికలపై శానిటైజర్ చల్లుతున్నారని, శానిటైజర్ వాడిన పేపర్ అని తెలిస్తే.. పాఠకులకు ఇలాంటి భయాలన్నీ పోతాయని రామోజీ సూచించారట.
అమ్మో.. పేపర్
అయితే మరోవైపు పేపర్లు ముట్టుకోవాలంటేనే పాఠకులు భయపడే పరిస్థితికి చేరుకుంది. పేపర్ ద్వారా కరోనా వైరస్ సంక్రమించే అవకాశాలున్నాయన్న వార్త వ్యాపించడంతో పేపర్ పఠనం కూడా పక్కన పెట్టాల్సివచ్చింది. హైదరాబాద్‌లోని కొన్ని అపార్ట్‌మెంట్స్‌లలో వేసిన పేపర్ వేసినట్టే ఉంటోంది. రోజుల తరబడి పేపర్లన్నీ ఒకే చోట పేరుకుపోతున్నాయి. దీన్ని బట్టిపేపర్ని ముట్టుకోవడానికి సైతం ప్రజలు భయపడుతున్నారని అర్థమవుతోంది. పేపర్ని ఇస్త్రీ పెట్టితో,వేడి చేసి, ఆ తరవాత చదివితే.. వైరస్ చనిపోతుందని భావించి – అలాంటి ప్రయత్నాలూ చేస్తున్నారు. మొత్తానికి కరోనా వల్ల.. దిన పత్రికల మనుగడకే ముప్పు ఏర్పడే ప్రమాదం వచ్చింది. కరోనా ప్రభావం తగ్గినా సరే – దిన పత్రికలు ఈ నష్టాన్ని పూర్చుకోవడం కష్టమే అని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే ఈ పేపర్ చదవడం అలవాటు చేసుకుంటున్నారు పాఠకులు. భవిష్యత్తులో ప్రింటింగ్‌ని ఆపేసి, ఈ పేపర్‌కే పరిమితమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.