కరోనా కాటు ప్రింట్ మీడియాపై పడబోతోందా? త్వరలోనే డైలీ పేపర్లు తాత్కాలికంగా మూసేస్తారా? ఆ అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాయి మీడియా వర్గాలు. దానికి రెండు మూడు కారణాలున్నాయి.
ఒకటి… పేపర్లపై కరోనా వైరస్ ఎక్కువ కాలం జీవించి ఉండడం. ఓ పేపర్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి పాఠకుడికి చేరేలోగా చాలా చేతులు మారుతుంది. అది కరోనా వ్యాప్తి కారకంగా నిలిచే ప్రమాదం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఈ కారణం చేతనే.. దిన పత్రికల సంస్థల్ని తాత్కాలికంగా మూసేశారు.
రెండోది… ఉద్యోగుల భద్రత. ఈనెల 31 వరకూ దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణం ఉంది. ఉద్యోగుల్ని కూడా ఇళ్ల వద్ద నుంచే పని చేయించుకోవాల్సిన పరిస్థితి. కొన్ని ప్రైవేటు సంస్థలు ఉద్యోగులకు సెలవుల్ని ప్రకటించింది. ప్రభుత్వ సంస్థలు సరేసరి. ప్రింట్ మీడియా ఉద్యోగులు ఇంటి దగ్గర ఉండి పని చేసే వీలు లేదు. వాళ్లు ఆఫీసులకు రావాల్సిందే. వాళ్ల ఆరోగ్యాల్ని దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా దిన పత్రికల్ని నిలిపివేసే అవకాశం ఉంది.
ఆంధ్రభూమి దిన పత్రిక ఈనెల 31 వరకూ ప్రింటింగ్ని ఆపేసింది. ఆంధ్రభూమి అనుబంధం సంస్థ అయిన డెక్కన్ క్రానికల్ దీ ఇదే పరిస్థితి. త్వరలోనే మిగిలిన ప్రధాన పత్రికలు ఇదే బాట పట్టే అవకాశం ఉంది. దిన పత్రికల ద్వారా కరోనా వ్యాప్తి తీవ్రమవుతుందని కేంద్ర ప్రభుత్వం కూడా భయపడుతోంది. అందుకే.. ప్రభుత్వం కూడా ఈ విషయంపై ఓ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే ప్రింట్ మీడియా పై నుంచి ఎలక్ట్రానిక్ మీడియాపై ఆధార పడడం అందరూ అలవాటు చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వార్తల్ని తెలుసుకోవాలంటే కావల్సినన్ని ఛానళ్లు ఉన్నాయి. కొన్నాళ్లపాటు దిన పత్రికలు ఆగిపోతే వచ్చే నష్టమేమీ లేదు. కాకపోతే అది ఎంత కాలం? అనేది ప్రధాన అంశం. ఒకవేళ దిన పత్రికలు కొంత కాలం ఆపేస్తే.. ఆ నష్టాన్ని భరించడానికి యాజమాన్యాలు సిద్ధంగా ఉంటాయా? ఉద్యోగులకు వేతనాలు చెల్లించగలుగుతాయా? ఇప్పటికే నష్టాల్లో ఉన్న కొన్ని పత్రికలు ఈ భారాన్ని మోయగలుగుతాయా? అనేవి బిలియన్ డాలర్ల ప్రశ్నలు.