హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తూండటంతో రైతు బంధు పథకం అమల్లో కూడా వేగం తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎల్లుండి హుజురాబాద్‌లో జరగనున్న ప్రారంభ కార్యక్రమంలో ఐదువేల మందికి దళిత బంధు పథకాన్ని పంపిణీ చేస్తారని అనుకున్నారు. కానీ సీఎం కేసీఆర్ వ్యూహం మార్చారు. దళిత బంధు ప్రారంభోత్సవ వేదికపై కేవలం 15 మందికి మాత్రమే పథకం చెక్కులను పంపిణీ చేయబోతున్నట్లుగా చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ప్రకటించారు. సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు హుజూరాబాద్ వెళ్లిన ఆయన … అందరికీ దళిత బంధు పథకం అందుకుందని భరోసా ఇచ్చారు.
అయితే.. ప్రారంభం రోజున పదిహేను మందికి మాత్రమే చెక్కులు ఇస్తారన్నారు. అయితే.. సీఎం కేసీఆర్ ఐదు వేల మంది దళిత కుటుంబాలకు పథకం అమలు చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం పదిహేను మందికే అనడంతో హుజూరాబాద్ దళిత లబ్దిదారుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. అధికారులు ఇప్పిటికే రాత్రింబవళ్లు పని చేసి.. 21 వేల మంది లబ్దిదారులను గుర్తించారు. వారందరికీ మీకు రూ. ప ది లక్షలు రాబోతున్నాయన్న సమాచారాన్ని కూడా అధికారులు ఇచ్చేశారు. ఆ 21వేల మందిలో ఐదు వేల మందికి పదహారో తేదీన అకౌంట్లో పది లక్షలు పడతాయని ఎదురుచూస్తున్నారు.
కానీ ఉపఎన్నిక నోటిఫికేషన్ ఆలస్యం అవుతూండం… పథకం అందరికీ చేరడానికి మరింత ఆలస్యమయ్యేలా చేసే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి హుజూరాబాద్‌లో దళితులు అందరికీ రూ. పది లక్షల చొప్పుున పంపిణీ చేయాలంటే.. రెండు వేల కోట్లకుపైగానే కావాలి. కానీ ప్రభుత్వం వద్ద అంత ఆర్థిక వెసులుబాటు ఉందో లేదో తెలియదు. బడ్జెట్లో మాత్రం రూ. వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించారు. అందులో రూ.. ఐదు వందల కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఇప్పుడు… హుజూరాబాద్ ఉపఎన్నిక ఆలస్యం అయినా అవకపోయినా చెప్పినట్లుగా పథకాన్ని వేగంగా అమలు చేయకపోతే టీఆర్ఎస్ సర్కార్‌పై విమర్శలు పెరిగే అవకాశం ఉంది.