తెలంగణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలకు దళిత బంధు గండం వచ్చి పడింది. నియోజకవర్గంలో ఎక్కడకు వెళ్లినా దళిత బంధు పథకాన్ని తమకు వర్తింప చేయాలన్న డిమాండ్లతో దళితులు ఎదురు వస్తున్నారు. వీరికి రాజకీయ పార్టీలు అండగా ఉంటున్నాయి. దీంతో ఎమ్మెల్యేలకు ఏం చెప్పాలో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఉపఎన్నిక వస్తుందని అప్పుడు.. సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని నియోజకవర్గంలో అమలు చేస్తారని.. అందుకే రాజీనామా చేయాలన్న డిమాండ్లు కూడా వినిపించడం ప్రారంభించారు. దీంతో చాలా మంది ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయి పర్యటనలు.. నియోజకవర్గ పర్యటనలు మానుకుని హైదరాబాద్‌కు పరిమితమవుతున్నారు.
ఎన్నికలకు ముందే దళిత బంధును అమలు చేయాలన్న డిమాండ్లు విపక్షాల నుంచి..అటు దళిత సంఘాల నుంచి కూడా వస్తూండటంతో సీఎం కేసీఆర్ ఆగస్టు పదహారో తేదీ నుంచి హుజూరాబాద్‌లో అమలు ప్రారంభించాలని నిర్ణయించారు. మొదటి విడుదలతో.. ఐదు వేల మందికి రూ. పది లక్షలు చొప్పున పంపిణీ చేయనున్నారు. అందు కోసం రూ. ఐదు వందల కోట్లు విడుదల చేస్తూ.. నాలుగు రోజుల కిందటే ఉత్తర్వులు ఇచ్చారు. లబ్దిదారులను ఇప్పటికే గుర్తించారు. ఇతర ప్రక్రియను అధికారులు పూర్తి చేస్తున్నారు. అయితే.. ఇలా నగదు బదిలీ ప్రారంభమైన తర్వాత వచ్చే పాజిటివ్ కన్నా.. నెగెటివే ఎక్కువగా ఉంటుందన్న భయం టీఆర్ఎస్ వర్గాల్లో ఇప్పుడు ప్రారంభమయింది.
కొంత మందికి ఇచ్చి..ఎన్నికల తర్వాత మిగతా వారికి ఇస్తామంటే .. ప్రజలు నమ్మరు. ఆగ్రహానికి గురవుతారు. అదేసమయంలో హుజూరాబాద్ ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందో క్లారిటీ లేదు. ఒక వేళ.. నెల … రెండు నెలలు ఆలస్యమైతే.. ఈ లోపు రైతు బంధు నిలిపివేయడానికి అవవకాశం లేదు. కొనసాగించారు. హుజూరాబాద్‌లో మిగిలిన దళిత కుటుంబాలకూ పంపిణీ చేయాలి. ఒక వేళ ఎన్నికల కోడ్ వచ్చినా.. ఆ పేరు చెప్పి పంపిణీ నిలిపివేస్తే.. తర్వాత ఇస్తారన్న నమ్మకాన్ని ప్రజలు పెట్టుకోలేరు. అదే సమయంలో ఇతర నియోజకవర్గాల్లో వస్తున్న డిమాండ్లతో.. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి టీఆర్ఎస్ నేతలకు ఏర్పడుతోంది .