హైదరాబాద్: కరీంనగర్ జిల్లా వీణవంక గ్రామంలో ఒక దళిత యువతిపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేసి వీడియోలో చిత్రీకరించి బెదిరించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇవాళ బాధితురాలిని పరామర్శించటానికి రాష్ట్ర రెవెన్యూమంత్రి ఈటెల రాజేందర్ వెళ్ళగా గ్రామస్తులు నిరసన తెలిపారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమలో పోలీసులకు, గ్రామస్తులకు వాగ్వాదం చోటుచేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టటంతో తోపులాట జరిగింది. మరోవైపు ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం వహించిన వీణవంక ఎస్ఐ, సీఐలను సస్పెండ్ చేయాలని మంత్రి ఈటెల ఆదేశించారు. గ్రామస్తులను శాంతింపజేశారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.
దాదాపు 20 రోజుల క్రితం జరిగిన ఈ అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీణవంక మండల కేంద్రంలో స్థానిక పోలీసులు కానిస్టేబుల్ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిబిరానికి హాజరైన శ్రీనివాస్ అనే అభ్యర్థికి బాధితురాలితో పరిచయం ఏర్పడింది. అతను ఆమెను శిబిరంవద్దనుంచి ఒక నిర్మానుష్య స్థలానికి తీసుకెళ్ళాడు. తన ఇద్దరు స్నేహితులను కూడా అక్కడకు పిలిపించుకుని ముగ్గురూ కలిసి అత్యాచారం చేశారు. “అన్నా వదిలిపెట్టండి మీ కాళ్ళు మొక్కుతా” అన్నాగానీ విడిచిపెట్టలేదు. వీడియోలో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. వాటిని అడ్డంపెట్టుకుని రోజూ రమ్మని వేధించసాగారు. చివరికి ఆమె కుటుంబసభ్యులకు చెప్పటంతో ఇది బయటకొచ్చింది. నిందితులపై నిర్భయ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. వారిలో ఇద్దరు మైనర్లు కావటం విశేషం.