పిల్లి మెడలో గంటకట్టిన హర్షకుమార్
పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక అప్పటికే రాజకీయ ప్రాబల్యం వున్న సామాజిక వర్గాల సమీకరణలను రీసెట్ చేసే ఆలోచన ఒకటి బయటికి వచ్చింది. దళితులు, కాపుల కాంబినేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఆల్టర్నేటివ్ పొలిటికల్ పవర్ కాగలదని ఒకనాటి కాంగ్రెస్ నాయకుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు జి వి హర్షకుమార్ ప్రతిపాదించారు. కాపునాయకుడు ముద్రగడ పద్మనాభం ముందు ఆయన ఈ సూచన వుంచారు.
కుల సమీకరణల మద్దతు లేని రాజకీయాలు భారతదేశంలో ప్రస్తుతానికి అసాధ్యం! విద్యాబుద్దులు, ప్రజా చైతన్యాలు వికసించే కొద్దీ అస్ధిత్వ ఉద్యమాలు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు రాష్ట్రాన్ని ఏలిన రెండు పార్టీల వెనుక ప్రధాన సమీకరణలు కులాల నుంచి వచ్చినవే!
రాయలసీమ, తెలంగాణా, కోస్తా జిల్లాలు కలిసివున్న ఎపిలో రెడ్లు, కాపులు, దళితులు కాంగ్రెస్ పార్టీకి – కమ్మలు, బిసిలు తెలుగుదేశం పార్టీకి ప్రధాన మద్దతు దారులుగా వున్నారు. రాష్ట్రం విడిపోయాక ఎపికి మిగిలిన 13 జిల్లాల్లో సంఖ్యాపరంగా రెడ్లు తగ్గిపోయారు. శక్తివంతులు, సంపన్నులు అయిన రెడ్లు హైదరాబాద్ లో వుండిపోయారు. ఎపిలో తెలుగుదేశం ప్రభుత్వం వుండటం తో ఈరాష్ట్రంలో కమ్మల ప్రాబల్యం పెరిగింది. కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టుల్లు ఇక్కడివారికే కాక హైదరాబాద్ లో వున్న అదే సామాజిక వర్గానికి కూడా దక్కుతున్నాయి.
13 జిల్లాల్లో సంఖ్యపరంగా కాపుల ప్రాబల్యం వుంది. వీరు ఆధిపత్యకులంలో దిగువవర్గాలుగా, దిగువ కులాల్లో ఆధిపత్య కులంగా వున్నారు. కాపులు, రెడ్లు, దళితులకు రాజకీయ అండగా వున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో క్రియాశీలకమైన పాత్ర వహించే అవకాశం కనుచూపు దూరంలో లేదు. ఆర్ధిక నేరాల కేసుల్లో చిక్కుకుపోయివున్న జగన్ భవితవ్యం తేలేవరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి కొత్త సామాజిక శక్తులు ప్రవేశించే అవకాశాలు తక్కువ. నాయకుడి ఏకపక్ష ధోరణులు తట్టుకోలేక, తెలుగుదేశం ప్రలోభాలకు లొంగిపోయి ఆపార్టీనుంచి నాయకులు జారిపోవడం ఇప్పటికే మొదలైంది.
ఆశలుకల్పించి మోసగిస్తున్న బిజెపి పట్ల సాధారణ ప్రజానీకంలో కూడా ఆగ్రహం గూడు కట్టుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యతలు, విదేశీ పెట్టుబడులపై తీరని మోజు కారణంగా మధ్యతరగతి ప్రజానీకంలో, గత ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన తటస్ధవాదుల్లో తెలుగుదేశం పట్ల విముఖత పెరుగుతోంది. ఈ పరిణామాలన్నీ కలసి 2019 ఎన్నికల నాటికి ఒక రాజకీయ శూన్యాన్ని పెంచే అవకాశం వుంది. అటువంటి శూన్యాన్ని సజావుగా బర్తీ చేయగల సమీకరణం రాజకీయ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యంలేదు. ట్రెడిషనల్ కేస్ట్ కాంబినేషన్లకు భిన్నంగా వేర్వేరు సామాజిక వర్గాలను అనూహ్యమైన రీతిలో కలిపిన ప్రయోగాన్ని ఉత్తర ప్రదేశ్ లో మాయావతి చేసి సఫలమయ్యారు. దళితులు, ముస్లింలు, బ్రాహ్మణుల్ని ఒకే రాజకీయ వేదిక మీదికి సమీకరించి ఓట్లు అర్ధించి ఆమె గెలుపొందారు. రాజకీయ అధికారం కోసం తాడిత, పీడితుల ఏకమవ్వాలన్న కాన్షీరామ్ ”బహుజన” సిద్ధాంతం మాయావతి ప్రయోగానికి ఆధారం అయ్యింది.
హర్షకుమార్ ఇపుడు బయటపెట్టిన ప్రతిపాదనకు ఉత్తర ప్రదేశ్ సక్సెస్ స్టోరీ ఒక ఆలోచనో, ఆధారమో కావచ్చు…అంతకు మించి రాష్ట్రంలో రూపుదిద్దుకుంటున్న రాజకీయవాతావరణమే ప్రధాన కారణం కావచ్చు.
ఉద్యమం ద్వారా కాపులను మరోసారి ఐక్యపరచిన ముద్రగడ పద్మనాభం తనకు మద్దతు ఇచ్చిన వారిని కలసి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆయన రాజమండ్రిలో ఆదివారం హర్షకుమార్ ను ఆయన ఇంట్లో కలుసుకున్నారు. ఆసందర్భంగా కులాలు రాజకీయాలపై హర్షకుమార్ ఈ సూచన చేశారు.
దీనిపై ఆయా సామాజిక వర్గాల్లో అంతర్గత, బహిర్గత, ఉమ్మడి చర్చలు జరగాలి. బలమైన అభిప్రాయం రూపుదిద్దుకోవాలి. అపుడే ఆలోచన ప్రయోగమౌతుంది. ఇందుకు వ్యవధి పడుతుంది. ఇదంతా జరగవచ్చు, జరగకపోవచ్చు…అయితే కొత్త సమీకరణాల ఆలోచనను దళిత, కాపు వర్గాల్లో ప్రవేశపెట్టిన…సూటిగా చెప్పాలంటే పిల్లిమెడలో గంట కట్టిన చొరవ జివి హర్షకుమార్ దే!!!