తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళిత బంధు పథకంతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన రైతులకు రుణమాఫీ హామీని కూడా సోమవారం నుంచే అమలు చేయాలని నిర్ణయించుకుంది. రూ. యాభై వేల వరకూ రుణంఉన్నరైతుల ఖాతాల్లో వారికి సొమ్ము జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు.. నిధులను విడుదల చేసింది. దాదాపుగా ఆరు లక్షల ఆరు వేల మంది రైతులకు రుణమాఫీ చేసేందుకురూ. రెండు వేల కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో మొదటి విడత రుణమాఫీ పూర్తి చేశారు. రూ. పాతిక వేల లోపు రుణం ఉన్న వారికి నిధులు జమ చేశారు. ఇప్పుడు రూ. యాభై వేలు ఉన్న వారికి జమ చేయబోతున్నారు. పేరుకు రుణమాఫీనే కానీ సాంకేతికంగా బ్యాంకర్లతో సంబంధం లేకుండా పథకాన్ని అమలు చేస్తున్నారు.
గతంలో రుణమాఫీ అంటే నేరుగా రుణాల్ని మాఫీ చేసి బ్యాంకులకు నగదు చెల్లించేవారు. ఈ సారి రూ. లక్ష వరకు రుణాన్ని నేరుగా రైతులకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే నేరుగారైతు ఖాతాకే జమ చేస్తారన్నమాట. రైతు బంధు పథకం నిధులు ఎలా జమ చేస్తున్నారో అలా..రుణమాఫీ నిధులు కూడా జమ చేస్తారు. ఒకే సారి మీట నొక్కి చేస్తారా లేకపోతే విడతల వారీగా నగదు జమ చేస్తారా అన్నదానిపై స్పష్టత లేదు. మరో వైపు సోమవారమే హుజూరాబాద్‌లో దళిత బంధు పథకాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారు. మొదటగా ఐదు వేల మంది హుజూరాబాద్ దళితులకు రూ. పది లక్షల చొప్పున సాయం అందించేందుకు నిధులు మంజూరు చేశారు.
పదిహేను మందికి చెక్కులు ఇచ్చి కేసీఆర్ లాంఛనంగా పథకాన్ని ప్రారంభిస్తారు. ప్రభుత్వం ప్రజల మద్దతును కూడగట్టుకోవడానికి ఇప్పుడు నగదు బదిలీ పథకాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. అవి కూడా భారీగా నగదు బదిలీ చేసే పథకాలు కావడంతో మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకాలను ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందన్నదానిపైనే ఇతర వర్గాల్లోనూ సానుకూల భావన ఏర్పడుతుంది. లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు ప్రభుత్వానికి ఏర్పడతాయి. అందుకే ప్రభుత్వం కూడా ఈ విషయంలో సీరియస్‌గా ఉంది.