దళిత బంధు పథకాన్ని ఓ ల్యాండ్ మార్క్‌గా చేసుకుని ఎన్నికల్లో జాక్ పాట్ కొట్టాలనుకుంటున్నకేసీఆర్ ప్రయత్నాలకు సొంత పార్టీ నేతలే గండి కొట్టేస్తున్నారు. పథకం అమలుకు శాంపిల్‌గా ప్రతి నియోజకవర్గంలో వంద మందికి దళిత బంధు ఇవ్వాలని నిర్ణయించారు. నిధులు మంజూరు చేశారు. రాజకీయ లబ్ది కోసమే ఈ పథకం తెచ్చారు కాబట్టి లబ్దిదారుల ఎంపిక జాబితాను ఖరారు చేసే అధికారం ఎమ్మెల్యేలకే ఇచ్చారు. ఇంకేముంది ఎమ్మెల్యేలు తమ విశ్వరూపంప్రదర్శిస్తున్నారు. ఎంతగా ఉంటే.. ఆ వంద మందిని కూడా టీఆర్ఎస్తో అనుబంధం ఉన్న వారిని ఖరారు చేస్తున్నారు. దీంతో అసలైన దళిత నిరుపేదలకు చాన్స్ దక్కడం లేదు.
మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య తన తమ్ముడికి ఇచ్చేశారు. మరికొంత మంది బంధువలకు ఇచ్చారు.ఇతర ఎమ్మెల్యేలదీ అదే బాట. కొద్ది మంది ఎమ్మెల్యేలు మాత్రం నిరుపేద దళిత కుటుంబాలను ఎంపిక చేశారు. టీఆర్ఎస్ నేతల తీరుపై దళితుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ కోసం ఇస్తున్న నిధులను టీఆర్ఎస్ నేతలు తింటున్నారన్న అభిప్రాయానికి వస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దళిత బంధు పథకానికి అందరూ అర్హులేనని.. దళితులై ఉంటే చాలని చెబుతున్నారు. ఇది నిజమే కానీ ఇలా అడ్డగోలుగా సొంత వారికి నిధులను దోచి పెట్టడం ఏమిటని ఇతరులు ప్రశ్నిస్తున్నారు.
కేసీఆర్ దళితులందరికీ రూ. పది లక్షలు ఇవ్వాలని ధళిత బంధు పథకం తెచ్చారు. అయితే ఈ విషయంలో అందరికీ ఒకే సారి ఇచ్చే పరిస్థితి లేదు. ఈ కారణంగా అయినా ముందుగా నిరుపేదలకు ఇస్తామన్న నిబంధన పెట్టలేకపోయారు. దీంతో లబ్దిదారుల ఎంపికలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇష్టారితీన వ్యవహరించి అసలైన దళితుల్లో ఆగ్రహానికికారణం అవుతున్నారు. వారి తీరు వల్ల ఈ పథకం వల్ల టీఆర్ఎస్కు వస్తున్న లబ్ది కంటే… నష్టమే ఎక్కువ జరుగుతోందన్న ఆందోళన పలువురు టీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో దీనపై జరుగుతున్న ప్రచారాన్ని కట్టడి చేయకపోతే ఇబ్బందేనని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తున్నారు.