ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి గౌతం సవాంగ్ రాజీనామా చేశారు. ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. నిజానికి ఆయన రాజీనామా చేయకపోయినా ప్రభుత్వం ఏమీ చేయలేదు. కానీ జరగబోతోంది ఏమిటో తెలుసు కాబట్టి గౌతం సవాంగ్ రాజీనామా చేశారు. అయితే ఆయనను వదిలేస్తారా అంటే.. జరిగిన పరిణామాలు… ఆయన నిర్వాకాలు గుర్తు చేసుకుంటే మాత్రం వదిలే అవకాశమే ఉండదని అనుకోవచ్చు.
టీడీపీకి ఆయన ఏం చేశారన్న సంగతి పక్కన పెడితే.. వైసీపీ స్కాముల్లో ఆయన భాగస్వామ్యం అయ్యారు. గ్రూప్ వన్ పోస్టుల భర్తీ గోల్ మాల్ లో ఆయనది కీలక పాత్ర. టీడీపీ హయాంలో ఇచ్చిన ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ వాల్యూయేషన్ వైసీపీ వచ్చాక జరిగింది. రెండు, మూడు సార్లు వాల్యూయేషన్ చేయించి మార్కుల గోల్ మాల్ చేసి… పోస్టులు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కోర్టు ఆ గ్రూప్ వన్ ఎంపికల్ని కొట్టేసింది. అయితే డివిజన్ బెంచ్ మాత్రం… స్టే ఇచ్చింది. టీడీపీ జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయి ఆధారాలను కూడా బయట పెట్టింది. సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది. ఇప్పుడు స్వయంగా అధికారంలో ఉన్నందున విచారణ చేయించడం ఖాయం. అదే జరిగితే మొదటి నిందితుడు సవాంగ్ అవుతారు.
అదే సమయంలో డీజీపీగా ఉంటూ చాలా తప్పుడు పనులు చేశారు. ఏబీ వెంకటేశ్వరరావుపై కేసులను మోపేందుకు ఓ సంతకాన్ని ఫోర్జరీ కూడా చేశారని ఆరోపణలు ఉన్నాయి. వివేకా హత్య కేసులో బీటెక్ రవిని నిందితుడుగా మార్చేందుకు భారీ కుట్ర సవాంగ్ డీజీపీగా ఉన్నప్పుడు జరిగిందని కూడా టీడీపీ నేతలకు తెలుసు. ఇక టీడీపీ నేతలపై దాడులు.. చివరికి చంద్రబాబుపై రాళ్ల దాడిని ప్రజాస్వామ్య నిరసన అని చెప్పిన వ్యవహారంలోనూ ఆయనపై పీకల మీద దాకా కోపం ఉంటుంది. మరి యిప్పుడు ఆయన రాజీనామా చేసినంత మాత్రానే వదిలేస్తారా ?