కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ నగర అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న దానం నాగేందర్ జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో పరాజయానికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసారు. కొద్ది సేపటిక్రితం ఆయన తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ కి పంపారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ “మా పార్టీ నాకు పూర్తి బాధ్యతలు అప్పగించకపోయినప్పటికీ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ నా పదవికి రాజీనామా చేసాను. పార్టీలో కొనసాగుతున్న వర్గ విభేదాలు నాకు చాలా బాధ కలిగిస్తున్నాయి. బడుగు బలహీన వర్గాలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోవడం వలననే వారు పార్టీకి దూరం అయ్యారు కనుకనే ఈ ఎన్నికలలో పార్టీకి ఓటమి ఎదురయిందని నేను భావిస్తున్నాను. హైదరాబాద్ ప్రజలు అభివృద్ధిని కాంక్షిస్తున్నందున అధికారంలో ఉన్న తెరాసకు ఓటు వేసినట్లు భావిస్తున్నాను. హైదరాబాద్ ప్రజల తీర్పును మేము గౌరవిస్తాము. ఇక నుండి పార్టీలో సామాన్య కార్యకర్తగా కొనసాగుతూ పార్టీ కోసం పని చేస్తాను,” అని అన్నారు.
ఆయన హైదరాబాద్ నగర అధ్యక్షుడుగా వ్యవహరిస్తునందున గ్రేటర్ ఎన్నికలలో తనే ముందుండి పార్టీని నడిపించి ఉండాలి. కానీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి, తదితరులతో విభేదించి ఎన్నికల సమయంలో పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరించి, ఇప్పుడు తనకు బాధ్యతలు అప్పగించలేదని పార్టీని నిందిస్తున్నారు. ఈ ఎన్నికలకు ఆయన దూరంగా ఉండి, పార్టీ ఓడిపోయినా తరువాత ఇప్పుడు ముందుకు వచ్చి పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
అసలు గ్రేటర్ ఎన్నికలకు ముందే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేసి తెరాసలో చేరిపోయేందుకు సిద్దం అయ్యారు. కానీ అప్పుడు బుజ్జగించడంతో పార్టీలో కొనసాగారు. పార్టీ నగర అధ్యక్షుడుగా కొనసాగినా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా తన బాధ్యతను విస్మరించారు. పార్టీ నేతలతో విభేదాలను, తన భేషజాలను, పంతాలను పక్కనపెట్టి పార్టీ విజయానికి కృషి చేసి ఉండి ఉంటే ఇప్పుడు రాజీనామా చేసినా గౌరవంగా ఉండేది. ఇప్పుడు తన పదవికి కూడా రాజీనామా చేసారు కనుక ఏదో ఒకరోజు మళ్ళీ తెరాస నుండి మళ్ళీ పిలుపు వస్తే పార్టీకి కూడా గుడ్ బై చెప్పేసి వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదు.