ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అటు బీఆర్ఎస్కు కాకుండా పోయారు. ఇప్పుడు కాంగ్రెస్ నూ దూరం చేసుకున్నారు. అనర్హతా వేటు పడితే.. ఒక్క చాన్స్ దానంపైనే ఉంది. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ.. కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు. ఈ విషయంలో ఆయనపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ పై వ్యవస్థల నుంచి ఒత్తిడి రావొచ్చు. అయినా ఆయన కాంగ్రెస్ కు దూరంగానే ఉంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ కొత్త ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ ఆయన హాజరు కావడంలేదు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లోనూ కనిపించడం లేదు. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రిని కూడా కలవలేదు. ఆయన రావడం లేదు అని కాంగ్రెస్ కూడా ఫీలవడం లేదు. రాకపోతే పోయారులే అనుకుని లైట్ తీసుకుంటున్నారు. దానం సిఫారసులను కూడా పట్టించుకోవడం లేదు.
ఇప్పుడు దానం నాగేందర్ రాజకీయంగా ఏం నిర్ణయం తీసుకుంటారన్నది కీలకంగా మారింది. మళ్లీ బీఆర్ఎస్లోకి వెళ్తే రానిస్తారేమో కానీ.. గతంలోలా ప్రాధాన్యం ఇవ్వరు. గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడుతూండటంతో కాంగ్రెస్ పార్టీనే తన డిమాండ్లను నెరవేరుస్తుందని ఆయన నమ్మకంతో బెట్టు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.