హైదరాబాద్: ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ వియ్యంకులవుతున్న సంగతి తెలిసిందే. గంటా కుమారుడు రవితేజ, నారాయణ రెండో కుమార్తె శాలినిల వివాహం ఈ నెల 30న జరగబోతోంది. ఆ పెళ్ళి తాలూకు సంగీత్ కార్యక్రమం నిన్న హైదరాబాద్లోని ఒక హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ ఓ రేంజ్లో రెచ్చిపోయారు. ‘బత్తమీస్ దిల్’ పాటకు అదరగొట్టే స్టెప్లు వేశారు. టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాసరావుకూడా ఆయనకు జతకలిశారు. మంత్రులు నారాయణ, గంటా వారిని చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు. ఈ సందర్భంగా దానంపై పలువురు కరెన్సీ నోట్లను విసిరేశారు. రవితేజ సినిమాలలో హీరోగా ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోవైపు తెలుగుదేశానికి చెందిన మరో ఇద్దరు ప్రముఖులుకూడా వియ్యంకులవుతున్నారు. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తమ్ముడి కుమార్తె మహిత, కొనకళ్ళ నారాయణ రెండో కుమారుడు చైతన్యల వివాహం నిశ్చయమైంది. నవంబర్ 2న నిశ్చితార్థం, డిసెంబర్లో పెళ్ళి జరపాలని ఇరుకుటుంబాలూ నిర్ణయించాయి. గంటా-నారాయణ కాపు సామాజికవర్గంవారు కాగా, కేఈ-కొనకళ్ళ గౌడ సామాజికవర్గానికి చెందినవారు.