ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అయినా కాంగ్రెస్ పార్టీ అంటే.. రెడ్డి సామాజికవర్గ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో రెడ్డి సామాజికవర్గం మొత్తం వైఎస్ జగన్ వెంట వెళ్లిపోయింది. కానీ తెలంగాణలో మాత్రం… కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారు. ముఖ్యమైన నేతలంతా ఆ సామాజికవర్గానికి చెందిన వారే. అదే సామాజికవర్గం ప్లస్ పాయింట్‌తో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ను దెబ్బకొట్టాలన్న ఆలోచనలో టీ కాంగ్రెస్ ముఖ్యనేతలున్నారు. కానీ కేసీఆర్ దీనికి దానం నాగేందర్ ద్వారా విరుగుడు కనిపెట్టారు. ఆయన కాంగ్రెస్‌కు గుడ్ బై చెబుతూ.. చెబుతూ… బలహీనవర్గాలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని… ఒక్క సామాజికవర్గానికే పెద్ద పీట వేస్తున్నారని… బలమైన ఆరోపణలే చేశారు. దానికి పొన్నాల, వీహెచ్ వంటి బీసీ నాయకుల పేర్లను సానుభూతిగా వాడేశారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఓ కుదుపు వచ్చినట్లయింది.
తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ అవ్వగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు వేర్వేరుగా పీసీసీ అధ్యక్షులను నియమించింది కాంగ్రెస్. బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నాల లక్ష్మయ్యను తెలంగాణ పీసీసీ చీఫ్‌గా నియమించారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీనియర్లు ప్రయత్నం చేసినా.. హైకమాండ్ మాత్రం పొన్నాల వైపే మొగ్గు చూపింది. కుమ్ములాటలు, రెడ్డి సామాజికవర్గ నేతలు సహాయ నిరాకరణ చేయడంతో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోయింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పీసీసీ చీఫ్‌గా ఉంటే… కాంగ్రెస్ గెలిచి ఉండేదనే వాదనను ఆ తర్వాత హై కమాండ్ ముందు గట్టిగా వినిపించారు. దీంతో పొన్నాల ను మార్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి పదవిని కట్టబెట్టారు.
కానీ పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదు. ఉత్తమ్ తో అదే సామాజిక వర్గానికి చెందిన నేతలు తరచూ ఘర్షణ పడుతుండడం తో పార్టీలో ఏం జరుగుతుందో.. హైకమాండ్‌కు కూడా అర్థం కావడం లేదు. దానం వ్యాఖ్యలతో ఇప్పుడు కాంగ్రెస్ లోని బీసీ నేతలు.. కాస్తంత ధైర్యం తెచ్చుకున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను సైలెంట్ గా గమనిస్తున్న బడుగు, బలహీన వర్గాలకు చెందిన సీనియర్ నేతలు… ఇప్పడు బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ, పొన్నాల లక్ష్మయ్య సహా మిగిలిన నేతలు హైకమాండ్ వద్దకు వెళ్లి పార్టీలో పరిస్థితుల్ని చెప్పనున్నారనే ప్రచారం ప్రారంభమైంది.
మొత్తానికి దానం నాగేందర్ వెళ్తూ..వెళ్తూ.. కాంగ్రెస్ పార్టీని సామాజికవర్గాల వారీగా విడగొట్టి వెళ్లారు. రెడ్డి వర్సెస్ బడుగు బలహీన వర్గాల నేతల మధ్య వాతావరణం మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తోంది. టీఆర్ఎస్కు కావాల్సింది కూడా ఇదే. ..!