బాలీవుడ్లో విషాదం చోటు చేసుకొంది. ‘దంగల్’ లో అమీర్ ఖాన్ కుమార్తెగా నటించిన బాలనటి సుహానీ భట్నాగర్ ఈరోజు ఢిల్లీలో కన్నుమూసింది. ఆమె వయసు 19 సంవత్సరాలు మాత్రమే. ఆమె కాలికి గాయమవ్వడంతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకొంది. అయితే చికిత్స ఆమెపై ప్రతికూల ప్రభావం చూపించడం, మందులు వికటించడంతో ఆమె తుదిశ్వాస విడిచింది. శవ పరీక్ష చేసిన తరవాతే.. పూర్తి వివరాలు బయటపడతాయి. ‘
దంగల్’లో బబితా కుమారి పాత్రలో ఆమె నటించింది. ఆ సినిమా సూపర్ హిట్టయ్యింది. దాంతో ఆమెకూ మంచి పేరొచ్చింది. `దంగల్` తరవాత కొన్ని సినిమాల్లో నటించింది. వాణిజ్య ప్రకటనల్లోనూ మెరిసింది. ఆ తరవాత సినిమాలకు పుల్ స్టాప్ పెట్టి, తన చదువుపై దృష్టి కేంద్రీకరించింది. సోషల్ మీడియాకు కూడా రెండేళ్లుగా దూరంగా ఉంటోంది. సుహాని మృతిపై బాలీవుడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. సుహానీ లేకుండా దంగల్ ప్రయాణం పూర్తవదని, ఆమె చనిపోయినా, ఓ ధృవతారగా ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుందని అమీర్ ఖాన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.