అమీర్ ఖాన్ సినిమా అంటేనే ఓ సంచలనం. త్రీ ఇడియట్స్, పీకే 2 చిత్రాలే అందుకు సాక్ష్యాలు. ఇండియాలో నెంబర్ వన్ గ్రాసర్ సినిమాల్ని లెక్క తీస్తే.. అందులో అమీర్ ఖాన్‌వే కచ్చితంగా రెండు మూడు ఉంటాయి. టాప్ వన్ లో పీకే ఇప్పటికీ.. చలామణీ అవుతోంది. సబ్జెక్ట్‌లను ఎంచుకోవడంలో, తన పాత్రని నభూతో అన్నట్టు తీర్చిదిద్దుకోవడంలో అమీర్ తరవాతే ఎవరైనా. ఇప్పుడు అందరి దృష్టీ దంగల్ సినిమాపై పడింది. ఈ సినిమా కోసం అమీర్ చేసిన కష్టం అంతా ఇంతా కాదు. 27 కిలోల బరువు పెరిగి.. మళ్లీ తగ్గాడు. ఈ సినిమా ప్రమోషన్లలో అలుపెరగకుండా పాల్గొన్నాడు. ఈ సినిమాని అందరికీ చేరువు చేయాలన్న ఉద్దేశంతో టికెట్లు రేట్లు పెంచకండి అంటూ… డిస్టిబ్యూటర్లను కోరుకొన్నాడు. పన్నుల్ని తగ్గించి.. తద్వారా టికెట్లు రేట్లు తగ్గడానికి సహాయపడమని ప్రభుత్వానికి విన్నవించుకొన్నాడు.
ఇప్పుడు దంగల్ బాక్సాఫీసు దగ్గర సమరానికి సిద్దమైంది. ఈసారీ అమీర్ ఖాన్ బాక్సాఫీసు రికార్డులన్ని సవరించడం ఖాయమనిపిస్తోంది. ఎందుకంటే దంగల్ రిపోర్ట్ ఆ స్థాయిలో ఉంది. దంగల్ ప్రివ్యూషోలు విరివిగా జరుగుతున్నాయి. ఈ సినిమాని ప్రత్యేకంగా వీక్షించిన బాలీవుడ్ హీరోలు, దర్శక నిర్మాతలు ముక్కుమీద వేలేసుకొంటున్నారు. దంగల్ అద్భుతంగా ఉందని కితాబులు ఇస్తున్నారు. వారి ట్వీట్లతో ట్విట్టర్ ఖాతాలు హోరెత్తిపోతున్నాయి. దంగల్ ఈ దశాబ్దానికే బెస్ట్ మూవీ అంటూ కరణ్ జోహార్ కితాబు ఇచ్చాడు. అభిషేక్ బచ్చన్ అయితే ఈ సినిమా గురించి వర్ణించడానికి మాటలు చాలట్లేదంటున్నాడు. సెలబ్రెటీలంతా దంగల్ రికార్డులు తిరగరాయడం, క్రీడలపై, ఆడవాళ్లపై మనకున్న అభిప్రాయాల్ని మార్చడం ఖాయమంటున్నారు. దంగల్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వాళ్లందరి మాటలు అక్షర సత్యాలు కావాలని కోరుకొందాం. దంగల్‌కి స్వాగతం పలుకుదాం.