వైసీపీ అధినేత జగన్ రెడ్డిని భవిష్యత్ భయం వెంటాడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని పటిష్టం చేయడం ఓ టాస్క్ అయితే…ఈ ఐదేళ్లు తనను తాను సేఫ్ జోన్ లో ఉంచుకోవడం మరో పెద్ద సవాల్. దీంతో వైసీపీ మనుగడ కోసం ఏం చేస్తే బాగుంటుంది..? అనే విషయంలో జగన్ రెడ్డి ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
వైసీపీ అధికారం కోల్పోవడంతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని కాంగ్రెస్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. దీంతో వైసీపీలోని కొంతమంది సీనియర్లు సైతం సొంత గూటికి చేరే విషయంలో ఆలోచన చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ కోలుకొని ఇప్పట్లో పుంజుకోవడం కష్టమని కాంగ్రెస్ లోకి వెళ్తే ఫ్యూచర్ ఉంటుందని సమాలోచనలు జరుపుతున్నారనే టాక్ విస్తృతంగా జరుగుతోంది. పైగా షర్మిల కూడా వైసీపీ సీనియర్లకు వెల్కం చెబుతున్నారు.
ఇదే సమయంలో పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా బీజేపీకి జగన్ దగ్గరయ్యే పరిస్థితి కూడా లేదు. టీడీపీ , జనసేన ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉండటంతో ఏం చేయాలనే విషయంలో జగన్ క్లారిటీకి రాలేకపోతున్నారు. అలాగని ఇండియా కూటమి వైపు వెళ్లే పరిస్థితి కూడా లేదు. దీంతో ప్రతిష్టకు పోకుండా , కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా వ్యవహరించి.. రాష్ట్రంలో కూటమికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే పార్టీ మరింత డ్యామేజ్ అవుతుంది. వీటన్నింటి నేపథ్యంలో వైసీపీ ఫ్యూచర్ పాలిటిక్స్ పై జగన్ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు.