జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. నివర్ తుపాన్ బాధిత రైతుల్ని పరామర్శించేందుకు ఆయన జిల్లాల పర్యటన ప్రారంభించారు. ఈ సందర్భంగా పామర్రు వద్ద పవన్ కల్యాణ్‌ను మాజీ ఎంపీ కె.పి.రెడ్డయ్య యాదవ్ కలిశారు. ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను.. తుపాన్ పరిహారం విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. అంచనాలతో సరిపెట్టి ఆదుకోని వైనం.. ఇలా మొత్తం పవన్ కల్యాణ్‌కు వివరించారు. పవన్ కల్యాణ్ కూడా.. రైతులను ఎలా ఆదుకోవాలన్న అంశంపై ఆయనతో చర్చించారు. రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి సలహాలు తీసుకుందామన్నారు. మామూలుగా పెద్దగా యాక్టివ్ గా లేని ఎంపీ పవన్ కల్యాణ్‌తో అలా సమావేశమై రైతుల కోసం చర్చించారని అనుకోవడానికి లేదు.
ఎందుకంటే.. రెడ్డయ్య యాదవ్ ఎవరో కాదు.. వైసీపీ ఎమ్మెల్యే… మాజీ మంత్రి పార్థసారధి తండ్రి. రెడ్డయ్య వారసుడిగానే పార్థసారధి రాజకీయాల్లోకి వచ్చారు. కుమారుడు ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఆయన ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తారని ఎవరూ అనుకోరు. పైగా ఆయన చాలా కాలంగా యాక్టివ్‌గా లేరు. హఠాత్తుగా పవన్ కల్యాణ్ పామర్రు రాగానే ఆయనతో సమావేశమయ్యారు. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇదంతా.. పార్థసారధికి తెలియకుండా జరుగుతుందని అనుకోవడానికి లేదని జనసేన నేతలతో పాటు వైసీపీ నేతలు కూడా అనుకుంటున్నారు. వైఎస్ హయాంలో మంత్రిగా చేసిన పార్థసారధికి.., జగన్ మొదటి కేబినెట్లో చోటు దక్కలేదు. మరో ఆరేడు నెలల తర్వాత పునర్వ్యవస్థీకరించబోయే కేబినెట్లో అయినా చోటు దక్కుందో లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఇద్దరు నానిలు పోటీ పడి చంద్రబాబును తిడుతూ.. తమ స్థానాన్ని పటిష్టం చేసుకుంటున్నారు. ఇటీవల ఇద్దరు బీసీ మంత్రులతో రాజీనామాలు చేయించినప్పుడే ఆయనకు అవకాశం వస్తుందనుకున్నారు. కానీ లెక్కలోకి తీసుకోలేదు. తన సీనియార్టీని గుర్తించడం లేదని పార్థసారధి వైసీపీపై అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం నేపధ్యంలో.. ఆయన తండ్రి పవన్ కల్యాణ్ కలవడం మాత్రం.. కీలకమైన మార్పుగానే పరిగణించవచ్చని అంటున్నారు. తొలి రోజు పర్యటనలో రైతులకు ఎకరానికి పాతిక నుంచి ముఫ్పై వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన పవన్.. అంత కంటే ఎక్కువగా పార్థసారధి తండ్రి భేటీ ద్వారా.. వైసీపీలో కలకలం రేపారని అనుకోవచ్చు.