తెలుగులో హరీష్ జయరాజ్‌కి ఎందుకో.. కాలం కలసి రాలేదు. ఆరెంజ్ లో క్లాస్ టచ్ ఉన్న పాటలు ఇచ్చాడు హారీష్. ఆ సినిమా హిట్టయితే.. తన రేంజ్ మరోలా ఉండేది. కానీ ఫ్లాప్ అవ్వడంతో, హరీష్ అంత మంచి పాటలు ఇచ్చినా, తనని ఎవరూ పట్టించుకోలేదు. దాంతో తెలుగులో హరీష్ పేరు వినిపించడం మానేసింది. ఇంత కాలానికి ఓ తెలుగు సినిమాకి హారీష్ పని చేస్తున్నాడు. అదే.. ‘ఎగస్ట్రా ఆర్డనరీ మేన్’. నితిన్ – వక్కంతం వంశీ కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమా ఇది. ఇందులోంచి ‘డేంజరు పిల్లా’ అనే పాట విడుదల చేశారు.
స్వతహాగా నితిన్ మంచి డాన్సర్. పైగా ఇదో మాస్ సినిమా. కాబట్టి.. మాస్ బీట్ ఉన్న పాటని రిలీజ్ చేసి ఉండొచ్చు. కానీ.. చిత్రబృందం మెలోడీని నమ్ముకొంది. `డేంజరు పిల్ల` పదం మాస్ గా ఉన్నా, ఇదో మంచి మెలోడీ. హారీష్ మ్యాజిక్ మరోసారి కనిపించింది. వినగా.. వినగా… మత్తుగా మనసుని ఆవహించేస్తోంది. ఆరెంజ్ మార్క్… ఈ మెలోడీలో కనిపించింది. కృష్ణకాంత్ అందించిన సాహిత్యం కూడా అర్థవంతంగా ఉంది.
”బ్లాక్ అండ్ వైట్ సీతాకోక చిలుకవా..
చీకట్లో తిరగని తళుకువగా
నగలు బరువట గుణమే నిధి అట..ఎగిరి పడదట” – ఇలా పదాలన్నీ సింపుల్‌గా సాగిపోయాయి. మొత్తానికి హారీష్ జయరాజ్ ఆల్బమ్‌కి ఇది మంచి ప్రారంభం. ఎగస్ట్రా ఆర్డనరీ మేన్‌లోని మిగిలిన పాటలూ ఇదే రేంజ్లో ఉంటే, హారీష్ కి తెలుగులో మరింత మంది ఫ్యాన్స్ తయారవ్వడం ఖాయం.