Darling Movie review
తెలుగు360 రేటింగ్ 1.5/5
కామెడీ సినిమాకెళ్లి – నవ్వుల కోసం శుభం కార్డు వరకూ పడిగాపులు కాయడం కంటే పెద్ద శిక్షేం ఉండదు.
తెరపై పాత్రలు రకరకాల హావభావాలు ప్రదర్శిస్తున్నా, వాళ్ల జోకులకు వాళ్లే నవ్వేసుకొంటున్నా – ప్రేక్షకుడి పెదాలపై కనీసం చిరునవ్వు కూడా రాకపోవడం కంటే పెద్ద పాపం మరోటి లేదు.
కమెడియన్లు హీరోలుగా మారితే వాళ్ల నుంచి కామెడీ సినిమాలే రావాలని లేదు.
కానీ ‘మాది హిలేరియస్ ఎంటర్టైనర్’ అన్నప్పుడు కచ్చితంగా అలాంటి నవ్వులు ఆశిస్తారు. `డార్లింగ్` విషయంలోనూ అదే జరిగింది. ‘మీ నవ్వులకు మాది గ్యారెంటీ’ అని టీమ్ అంతా ఢంకా బనాయించి చెప్పింది. కానీ అది ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఇచ్చిన వాగ్దానమే అని సినిమా చూశాకే తెలిసింది.
కథలోకి వెళ్దాం. రాఘవ (ప్రియదర్శి)కి చిన్నప్పటి నుంచీ ఒకటే కోరిక. బాగా చదివి, మంచి ఉద్యోగం తెచ్చుకొని, అందమైన అమ్మాయిని భార్యగా చేసుకొని హనీమూన్ కోసం పారిస్ వెళ్లాలని. అలానే బాగా చదువుతాడు. ఉద్యోగం సంపాదిస్తాడు. ఓ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకొంటాడు. కానీ సడన్ గా ఆ అమ్మాయి పెళ్లి పీటల నుంచి పారిపోతుంది. ఆ ఫస్ట్రేషన్ భరించలేక రాఘవ ఆత్మహత్య చేసుకోవాలనుకొంటాడు. అప్పుడే ఆనంది (నభా నటేషా) పరిచయం అవుతుంది. ఆమె మాటలతో ప్రభావితుడై ఆత్మహత్యా ప్రయత్నం మానుకొంటాడు రాఘవ. అంతేకాదు. ఆమెతో ప్రేమలోనూ పడిపోతాడు. పరిచయమైన నాలుగు గంటల్లోనే పెళ్లి కూడా చేసేసుకొంటాడు. ఫస్ట్ నైట్ రోజున రాఘవకు ఓ నిజం తెలుస్తుంది. ఆనందిలో ‘ఆది’ అనే మరో అమ్మాయి ఉందని, తను స్ల్పిట్ పర్సనాలిటీతో బాధ పడుతోందని అర్థమవుతుంది. అప్పుడు రాఘవ ఏం చేశాడు? ఆనందిలోని ఆదిని ఎలా హ్యాండిల్ చేశాడు? అసలు ఆనంది ఎవరు? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా తరువాతి కథ.
స్ల్పిట్ పర్సనాలిటీ అనేది తెరకు కొత్త విషయం ఏమీ కాదు. చంద్రముఖి, అపరిచితుడు సినిమాల్లో ఈ పాయింట్ ఎన్నిరకాలుగా వాడాలో, అన్ని రకాలుగానూ వాడేశారు. దానిపై బోలడన్ని కామెడీలు, పేరడీలు నడిచాయి. ఓ రకంగా అరిగిపోయిన ఫార్ములా. అదే పాయింట్ ని బలంగా నమ్మి సినిమా చేశాడంటే ధైర్యమో, మొండితనమో, లేదంటే తమపై తమకు అపరిమితమైన నమ్మకమో అయ్యి ఉండాలి. కామెడీ కథలకు ఓ సౌలభ్యం ఉంది. పాత పాయింటే చెప్పినా, దాన్ని వినోదభరితంగా తీర్చిదిద్దితే పాస్ అయిపోవొచ్చు. `రొటీన్` అనే ముద్ర గురించి కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. కానీ `డార్లింగ్`లో అది మిస్సయ్యింది. పాయింట్ పరంగా ఎంత వీక్ గా ఉందో, రైటింగ్ పరంగానూ ఈ సినిమా అంతే బలహీనంగా కనిపించింది. తెరపై ప్రియదర్శి ఉన్నాడు కాబట్టి, తన కామెడీ టైమింగ్ తో కొద్దో గొప్పో.. వినోదాన్ని పుట్టించగలిగాడు. కాబట్టి తొలి సగంలో అక్కడక్కడైనా ఈ కథని భరించొచ్చు. ద్వితీయార్థానికి వచ్చేసరికి ప్రియదర్శి కూడా ఏమీ చేయలేకపోయాడు.
నభా నటేషా పై తెరకెక్కించిన మాంటేజ్ సాంగ్ తో సినిమా మొదలైంది. ఆ పాట చూస్తే తన క్యారెక్టర్ పూర్తిగా టిపికల్ గా ఉండబోతోందని అర్థమైంది. దాన్ని అలానే డిజైన్ చేశారు కూడా. ఆ తరవాత ప్రియదర్శి ఆత్మహత్య ఎపిసోడ్ తెరపైకి వస్తుంది. ప్రియదర్శి బాల్యం, కలలు.. వీటిలో కథకు బీజం వేసే ప్రయత్నం చేశారు. హీరో స్నేహితుల బ్యాచ్ చేసే కామెడీ కాస్త రిలీఫ్ ఇస్తుంది. పెళ్లయ్యాక అసలు కథ మొదలవుతుంది. కథానాయిక స్ల్పిట్ పర్సనాటిలీతో బాధ పడుతుందన్న విషయాన్ని టీజర్, ట్రైలర్లోనే చెప్పేశారు. కాబట్టి ఈ పాయింట్ కు వీలైనంత త్వరగా రావాల్సిన అవసరం ఉంది. కానీ ఇంట్రవెల్ ముందు వరకూ కాలయాపన చేశారు. నిజానికి ఇది రాఘవ కథ కాదు. ఆనంది కథ. అలాంప్పుడు రాఘవ ఫ్లాష్ బ్యాక్‌కి అంత సమయం కేటాయించాల్సిన అసవరం లేదు. పోనీ అక్కడేమైనా కామెడీ పండిందా అంటే అదీ లేదు. ఆనందిలో ఆది ఒక్కరే కాదు.. చాలా చాలా పాత్రలున్నాయని తెలిశాక ఇంట్రవెల్ కార్డు పడుతుంది. అది కాస్త ఆసక్తి కలిగించే ఎలిమెంటే. సెకండాఫ్ రన్‌కి బాగా ఉపయోగపడాల్సిన పాయింట్. కానీ ఆ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే దాన్ని దర్శకుడికి ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు. ఆనందిలోపలున్న రకరకాల పాత్రలు బయటకు వచ్చినప్పుడల్లా తెరపై కంగాళీ మొదలైపోతుంది. ఆ ప్రహసనం నవ్వులు పంచకపోగా.. ప్రేక్షకులలో ఇరిటేషన్ తెప్పిస్తుంది. షాపింగ్ మాల్ లో జరిగే సీన్… దానికి అతి పెద్ద నిదర్శం. దాదాపు 5 నిమిషాల సీన్ అది. అక్కడ జరిగే తతంగం చూస్తే… మనలో అంరర్లీనంగా దాక్కున్న మరొకడు లేని – ‘పారిపోదాం సోదరా’ అని మనల్ని కూడా బయటకు లాక్కెళ్లిపోతాడేమో అనిపిస్తుంది.
ఆనంది పాత్రతో అంతర్లీనంగా ఓ సందేశం ఇస్తున్నాడేమో దర్శకుడు అనే ఫీలింగ్ వచ్చిందో సారి. ఆనంది – రాఘవ – ఓ ముసలి తాత మధ్య సీన్ చూస్తే `చైల్డ్ అబ్యూజ్`కు సంబంధించిన బలమైన విషయం ఈ కథలో ఉందన్న భ్రమ కలుగుతుంది. దాన్ని దర్శకుడు అత్యంత సున్నితంగా హ్యాండిల్ చేశాడు కూడా. కానీ లోతుగా ఆలోచిస్తే అక్కడే లాజిక్ తన్నేసింది. చిన్నప్పటి నుంచీ పారిస్‌లోనే ఉంటున్న ఆనందినికీ, ఎక్కడో ఇండియాలో ఓ మారుమూల ప్రాంతంలో ఉంటున్న ఆ ముసలివాడికీ లింక్ ఎలా కుదురుతుంది? ఇదే కాదు. చాలా విషయాల్లో దర్శకుడు లాజిక్ ఆలోచించలేదు. ఆనందిలో ఉన్న ప్రతీ క్యారెక్టర్ కీ ఏదో ఓ ఫ్లాష్ బ్యాక్ ఉండి ఉంటుంది అనే ఆలోచనలో ప్రేక్షకుడు ఉంటాడు. కానీ దర్శకుడు వాటి గురించి అస్సలు ప్రస్తావించనే లేదు. చివరి 20 నిమిషాల్లో ఎమోషనల్ గా డ్రైవ్ చేద్దామనుకొన్నారు. రఘుబాబు ఎపిసోడ్ అలాంటిదే. రఘుబాబు లాంటి సీనియర్ యాక్టర్ సీరియస్ గా డైలాగులు చెబుతుంటే ప్రేక్షకుడు ఎమోషన్ గా కనెక్ట్ అవ్వడు. ప్రియదర్శి తనకు ఆనంది అంటే ఎంత ఇష్టమో చెబుతుంటే ప్రేక్షకుల మనసు చెమ్మగిల్లదు. ఎందుకంటే.. అప్పటికే ప్రేక్షకుడు కథతో డిస్కనెక్ట్ అయిపోయి ఉంటాడు. క్లైమాక్స్ లో నిహారిక ఎంటర్ అయి కథని కొత్త మలుపు ఇద్దామనుకొంటే, అప్పటికే ఆడియన్ థియేటర్ బయటకు వచ్చేసి ఉంటాడు.
ప్రియదర్శి, నభాలపైనే ఈ సినిమా భారం పడిపోయింది. ప్రియదర్శి కాస్త ఆ భారాన్ని మోయగలిగాడు కూడా. ఉన్నంతలో సీన్‌ని కాస్త స్టేబుల్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ నభా తేలిపోయింది. స్ల్పిట్ పర్సనాటిటీ, ఒకరిలోనే రకరకాల వ్యక్తులు.. ఇలాంటి పాత్ర హ్యాండిల్ చేయడాలంటే కష్టమే. నభా అనుభవం, అమెకున్న పరిణితి ఈ పాత్రకు సెట్ కాలేదు. నభా స్థానంలో మరో కథానాయిక అయితే… సీన్ మరోలా ఉండేదేమో..? మొదట్లో సుహాస్, చివర్లో నిహారిక అతిధి పాత్రల్లో కనిపించారు. మిగిలిన పాత్రలకు అంత స్కోప్ లేదు.
సినిమా క్వాలిటీ పరంగా బాగుంది. నిర్మాణ విలువలు కనిపించాయి. పాటలు వింటున్నప్పుడు ఓకే అనిపిస్తాయి. కథానాయిక పరిచయ గీతంలో కాశర్ల శ్యామ్ అందించిన సాహిత్యం బాగుంది. నిడివి పరంగా సినిమా పెద్దదే. ట్రిమ్ చేసుకొనే వీలుంది. కామెడీ సినిమా చూడబోతున్నాం అని ప్రేక్షకులు ఫిక్సయ్యాక… వాళ్లని నవ్వించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ‘ఐ వాంట్ మోర్’ అని ఇందులో ప్రియదర్శి అన్నట్టే.. ప్రేక్షకుడూ అనుకొంటాడు. ఆ స్థాయిలో నవ్వించే సత్తా ఈ స్క్రిప్టులో లేకపోయింది. దాంతో ‘డార్లింగ్’ కాస్త బోరింగ్ గా తయారైంది.
తెలుగు360 రేటింగ్ 1.5/5