తిరుమల గతంలోలా భక్తులతో కళకళలాడటం సాధ్యమేనా..? ఒక్కో భక్తుని ఆరు అడుగుల సోషల్ డిస్టెన్స్ మెయిన్టెయిన్ చేస్తూ.. రోజుకు పదివేల మందికి అయినా దర్శనం చేయించగలరా..? లఘు దర్శనం..మహా లఘ దర్శనం అమలు చేసేసి.. ఎంత మంది భక్తులకు.. ఆ కోనేటి రాయుడి దర్శనాన్ని సంతృప్తిగా అందించగలరు..? ఇప్పుడు ఇదే పెద్ద విషయం. శ్రీవారి దర్శనాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్శనాలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం భక్తులందరినీ దర్శనాలకు అనుమతించకుండా కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు, స్థానికులతో ప్రయోగాత్మకంగా దర్శనాలను ప్రారంభించనున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించినందున గంటకు 300 మందికి మాత్రమే దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా రోజుకు 15 గంటలపాటు దర్శన సమయం కేటాయిస్తే.. కేవలం నాలుగు వేల ఐదు వందల మంది మాత్రమే దర్శనం చేసుకోగలుగుతారు. వైరస్ వ్యాప్తి కారణంగా మార్చి 20 నుంచి శ్రీవారి దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపివేసింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రెండున్నర నెలల సుదీర్ఘ కాలం తిరుమలకు భక్తులను నిషేధం విధించాల్సి వచ్చింది.
ఇక నుంచి పాసుల వ్యవస్థ ప్రవేశ పెట్టే అవకాశంఉంది. ముందస్తుగా అనుమతి తీసుకున్న వారే కొండపైకి వచ్చేలా నిబంధనలు పెట్టే అవకాశం ఉందంటున్నారు. ఎనిమిదో తేదీ తర్వాత ప్రయోగాత్మక దర్శనాలతో పరిస్థితిపై క్లారిటీ వచ్చిన తర్వతా సాధారణ భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఆ లోపే విధి విధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది.