కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.. గతంలో ప్రభుత్వం ఇచ్చిన రూ. కోటితో పిల్లల పెళ్లిళ్లు, కొంత భూమి కొనుక్కున్నానని ఇప్పుడు మందులకు డబ్బులు లేవని ఆయన చెప్పినట్లుగా కొన్నిమీడియాల్లో వార్తలు వచ్చాయి. వెంటనే రాజకీయ సోషల్ మీడియా జడలు విప్పుకుని.. ప్రభుత్వంపై విరుచుకుపడింది. పెన్షన్లు ఇవ్వడం లేదని చెప్పింది. కానీ మార్చి 31వ తేదీనే ప్రభుత్వం చెల్లించింది. ఇందుకు సంబంధించిన అధికారిక రశీదును కూడా విడుదల చేసింది.
దర్శనం మొగులయ్య పద్మశ్రీ సాధించుకున్నారు. ఆయనకు ప్రభుత్వం ఆరు వందల గజాల స్థలంతో పాటు రూ. కోటి చెక్కు్ ఇచ్చింది. దాన్ని ఆయన వాడుకున్నారు. అయినా మళ్లీ సాయం చేయాలన్నట్లుగా ఆయన మీడియాకు ఇలా సమాచారం ఇవ్వడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. తెలంగాణలో చాలా మంది పద్మశ్రీలు ఉన్నారు.. వారెవరికీ ఇవ్వనంత సాయం ప్రభుత్వం మొగులయ్యకు ఇచ్ిచంది. ఏ ప్రభుత్వం అన్న సంగతి పక్కన పెడితే ప్రజాధనాన్ని ఆయనకు సాయంగా ఇచ్చారు. ఇచ్చిన సొమ్మును జాగ్రత్తగా దాచుకుని జీవనం సాగించాలి కానీ.. రూ. కోటి ఇచ్చినా ఖర్చయిపోయాయని మళ్లీ సాయం చేయాలన్నట్లుగా మీడియాను ఉపయోగించుకుని ప్రచారం చేయించుకోవడం ఏమిటన్న విస్మయం వ్యక్తమవుతోంది.
మొగులయ్య కళాకారుడు. ఆయన నిరుపేద జీవితం గురించి తెలుసుకుని గతంలో ఎంతో మంది సాయం చేశారు. భీమ్లా నాయక్ సినిమలో పాట పాడినందుకు నిర్మాత రెమ్యూనరేషన్ ఇస్తే.. పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా రెండూ లక్షలు అందించారు. ఇలా ఎంతో మంది సాయం చేశారు. అయినా ఆయన ప్రతి ఆరు నెలలకు ఓ సారి ఇలా మీడియాకు తాను దీన స్థితిలో ఉన్నానని సమాచారం ఇవ్వడం.. ఆ కథనాలతో ప్రభుత్వం మరో కోటి ఆయనకు ఇవ్వాలన్నట్లుగా డిమాండ్లు వినిపించడం పరిపాటిగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి.