మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు లేడు. శిద్దా రాఘవరావు .. జగన్ ప్రభుత్వం మైనింగ్ వ్యాపారంలో రూ. 500 కోట్ల ఫైన్ వేయగానే భయపడి వైసీపీలో చేరిపోయారు. కానీ దర్శిలో టీడీపీ గెలిచింది. దీనికి కారణం బాధ్యతలు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తీసుకోవడమే. ఇప్పుడు నియోజకవర్గ బాధ్యతలు కూడా ఆయనే తీసుకుని తన సమీప బంధువు గొట్టిపాటి లక్ష్మికి టిక్కెట్ ఇప్పించుకున్నారు. దీంతో దర్శి రాజకీయం ఒక్క సారిగా మారిపోయింది.
దర్శిలో వైసీపీ అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నిజానికి దర్శి అంటే బూచేపల్లి వర్సెస్ శిద్దా. వీరు పెట్టే ఖర్చు ముందు రాష్ట్రంలో మరే నియోజకవర్గం సాటి రాదు. అలాంటి పోరాటం వరుసగా రెండో సారి మిస్ అవుతోంది. 2019 ఎన్నికల్లో ఓటమి భయంతో తాను పోటీ చేయనని జగన్ కు చెప్పేశారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. దీంతో జగన్ పీఆర్పీ తరపున పోటీ చేసి ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్‌ని పిలిచి టిక్కెట్ ఇచ్చారు. శిద్దాపై ఆయన గెలిచారు. కానీ బూచేపల్లికి మళ్లీ అధికారం మీద ఆశ పుట్టింది. గెలిచింది మద్దిశెట్టినే కానీ జగన్ మోహన్ రెడ్డి .. తమ వాడు అయిన బూచేపల్లికే ఎమ్మెల్యే పవర్స్ ఇచ్చారు. దీంతో మద్దిశెట్టి రగిలిపోయారు. చివరికి టిక్కెట్ కూడా ఎగ్గొట్టారు. రెడ్డికే చాన్సిచ్చారు.
టీడీపీ అభ్యర్థి ఎవరనేది చివరి వరకూ ఖరారు కాలేదు. కానీ టీడీపీ అనూహ్యంగా గొట్టిపాటి ఆడపడుచు లక్ష్మిని బరిలోకి దింపడంతో దర్శి ఈక్వేషన్లు చకచకా మారిపోయాయి. గొట్టిపాటికి ఇప్పుడు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మద్దతిస్తున్నారు. బూచెపల్లిని ఓడించి తీరాలని ఆయన కూడా కంకణం కట్టుకున్నారు. గొట్టిపాటి రవి స్వయంగా గొట్టిపాటి లక్ష్మికి బాబాయ్. ఆయనే బాధ్యత తీసుకుని టిక్కెట్ ఇప్పించారు. గెలుపు కోసం వ్యూహాం పన్నుతున్నారు. కొద్ది రోజులుగా వైసీపీ లోకల్ నేతలు టీడీపీలోకి వరుసగా చేరిపోతున్నారు. గొట్టిపాటి ఇంటి నేతగా క్లీన్ ఇమేజ్ ఉన్న డాక్టర్ లక్ష్మికి దర్శిలో సానుకూలంశాలు కనిపిస్తున్నాయి.
మద్దిశెట్టి దర్శిలో కీలకంగా ఉన్న ఆయన సొంత సామాజికవర్గం కాపుల్లో మంచి పలుకుబడి ఉండటం. గొట్టిపాటి లక్ష్మి కమ్మ నాయకురాలు అవ్వడం.. స్థానిక జనసేన నేతల నుంచి పూర్తి సహకారం లభిస్తుండటంతో కమ్మ, కాపు ఈక్వేషన్ కలసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గొట్టిపాటి లక్ష్మి మీ ఆడపిల్లను .. మీ ఊరికి వచ్చాను.. ఆశ్వీర్వదించడి అంటూ ప్రచారంలో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దర్శి నియోజకవర్గం టీడీపీ హయంలోనే అభివృద్ది చెందిందని గుర్తు చేస్తున్నారు.
దర్శిలో ఎప్పుడూ ఎన్నికలు ఏకపక్షంగా జరగవు. టీడీపీ అభ్యర్థిని ప్రకటించనంత వరకూ వైసీపీకి ఎదురు లేదని అనుకున్నారు. బూచేపల్లికి అక్కడ పట్టు ఉండటమే కారణం. కానీ గొట్టిపాటి లక్ష్మి రంగంలోకి వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. బూచేపల్లికి ఎంత ప్లస్ ఉంటే.. అంత కంటే ఎక్కువ మైనస్ లు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉండటంతో… ఇప్పుడు బూచేపల్లి మళ్లీ అనవసరంగా ఎమ్మెల్యే బరిలోకి దిగానా అని బాధపడే పరిస్థితి వచ్చిందంటున్నారు.