తెలుగు చిత్రసీమకు సంక్రాంతికి మించిన సీజన్ ఉండదు. ప్రతీ యేటా సంక్రాంతికి బడా సినిమాలు క్యూ కడతాయి. హిట్టొచ్చిందా, వసూళ్ల పండగే. ఈ సంక్రాంతికి అదే రుజువైంది. అటు చిరంజీవి, ఇటు బాలయ్య.. తమ ప్రతాపం చూపించారు. బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిపించుకొన్నారు. అసలైన సంక్రాంతి మజా ఏమిటో రుచి చూపించారు. టాలీవుడ్ కి సంక్రాంతి మాత్రమే కాదు.. దసరా కూడా అద్భుతమైన సీజనే. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది. అప్పుడప్పుడూ సంక్రాంతి సీజన్లు నిరాశ పరుస్తుంటాయి కానీ, దసరాకి మాత్రం ఒకట్రెండు హిట్లు పడుతుంటాయి. అందుకే దసరా సీజన్‌పై నిర్మాతలు గురి పెడుతుంటారు. ఈసారి దసరా కూడా మామూలుగా ఉండడం లేదు. ఏకంగా 4 సినిమాలు విడుదల కాబోతున్నాయి. బాలయ్య, రవితేజ, రామ్ లతో పాటు తమిళ హీరో విజయ్ కూడా ఈ పండక్కి రాబోతున్నాడు.
బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈసినిమాని దసరాకి సిద్ధం చేస్తున్నారు. ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డితో ఓ హిట్టు తన ఖాతాలో వేసుకొన్న బాలయ్య.. ఈ దసరాపై కూడా గురి పెట్టాడన్నమాట. ఈ సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య విజయంలో రవితేజకీ వాటా ఉంది. అంతే కాదు.. ఆ తరవాత వచ్చిన ధమాకాతో కూడా సూపర్ హిట్ కొట్టాడు రవితేజ. ఇప్పుడు `టైగర్ నాగేశ్వరరావు` సినిమాని దసరా బరిలో నిలిపాడు. అక్టోబరు 20న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. రామ్ – బోయపాటి శ్రీను కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమానీ దసరాకే విడుదల చేస్తున్నారు. రవితేజ సినిమాతో పాటుగా.. రామ్ సినిమా కూడా అక్టోబరు 20నే వస్తోంది. విజయ్ – లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కున్న `లియో` సైతం దసరా బరిలోనే ఉంది. తమిళ సినిమా అయినప్పటికీ… ఇది.. లోకేష్ కనగరాజ్ మూవీ. కాబట్టి తప్పకుండా తెలుగు ప్రేక్షకులూ దీనిపై దృష్టి పెడతారు. మొత్తానికి ఈ దసరా మామూలుగా ఉండదు. సంక్రాంతికి మించిన కాక పుట్టించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కనీసం రెండు హిట్లు చూసినా.. బాక్సాఫీసు షేక్ అయిపోవడం ఖాయం.