అక్టోబర్ లో రెండు పండగలు కలిసొచ్చాయి. దసరా తో పాటు అక్టోబర్ చివర్లో దీపావళి సినిమాల సందడి కూడా మొదలైపోతుంది. తొలి వారంలో నాలుగు సినిమాలు వస్తున్నాయి. శ్రీవిష్ణు ‘శ్వాగ్’ 4న విడుదల కానుంది. దీంతో పాటు ప్రిన్స్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రల్లో ‘కలి’, సాయి ధన్సిక లీడ్‌గా ‘దక్షిణ’, నోయల్, రిషిత నెల్లూరు నటించిన ‘బహిర్భూమి’, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్ హీరోగా రూపొందిన ‘మిస్టర్ సెలబ్రిటీ’, ఈటీవీ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ నటించిన తొలి సినిమా ‘రామ్‌నగర్ బన్నీ’ కూడా అదే డేట్ కి వస్తున్నాయి.
ఈ సినిమాలన్నిటిలో శ్రీవిష్ణు ‘శ్వాగ్’ పైనే ఎక్కువ బజ్ వుంది. నాలుగు తరాల కథ. శ్రీవిష్ణు నాలుగు గెటప్పుల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమా దర్శకుడు హసిత్ గోలి గతంలో రాజరాజ చోరతో ఓ హిట్ ఇచ్చాడు. రీతు వర్మ, మీరా జాస్మిన్ సునీల్ ఇలా ప్రముఖ తారాగణం వుంది. పీపుల్ మీడియా ఫాక్టరీ నిర్మాణం. ఇవన్నీ సినిమాపై ఆసక్తిని పెంచాయి.
‘రామ్‌నగర్ బన్నీ’ ట్రోలింగ్ ప్రమోషన్స్ తో కొందరి దృష్టిని ఆకర్షించగలిగింది. చంద్రహాస్ యాటిట్యూడ్ విపరీతంగా ట్రోల్ అయ్యింది. ఆర్జీవి లాంటి మరో ట్రోలింగ్ సెలబ్రిటీ సమక్షంలో ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా చేశారు. మొత్తానికి తొలి సినిమాకే యాటిట్యూడ్ స్టార్ ట్యాగ్ తో వస్తున్నాడు ‘రామ్‌నగర్ బన్నీ’. నరేశ్ అగస్త్య ‘కలి’ టీజర్ ఆసక్తికరంగానే వుంది. అయితే ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించగలదా లేదా అనేది అనుమానం. ‘దక్షిణ’తో పాటు మిగతా సినిమాలపై ఏమంత బజ్ లేదు.
రెండో వారం దసరా. నిజానికి దసరా వారంలోనే కనీసం రెండు పెద్ద తెలుగు సినిమాలు రావడం ఆనవాయితీగా వుండేది. కానీ ఈ ఏడాది పెద్ద సినిమాల జోరు లేదు. కేవలం గోపీచంద్ ‘విశ్వం’ ఒక్కటే తెలుగులో పెద్ద సినిమా. గోపీచంద్ శ్రీనువైట్ల కాంబినేషన్ లో అక్టోబర్ 11న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తోంది. శ్రీనువైట్ల మార్క్ వినోదం వున్న సినిమా ఇది. దసరాకి తెలుగులో మరో పెద్ద సినిమా లేకపోవడం కలిసోచ్చే అంశం. గోపీచంద్, శ్రీనువైట్ల.. ఇద్దరూ కమర్షియల్ సినిమాలతో అలరించేవారే. అయితే చాలా కాలంగా వీరికి మంచి కమర్షియల్ విజయం దక్కలేదు. ఆ లోటు విశ్వం తీరుస్తుందేమో చూడాలి.
డబ్బింగ్ సినిమా రజనీకాంత్ ‘వేట్టయన్’ కూడా దసరా బరిలో వుంది. అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా 10న విడుదల కానుంది. రజనీ సినిమా అనగానే ఒక అటెన్షన్ వుంటుంది. దీని తోడు జైలర్ తర్వాత రజనీ నుంచి వస్తున్న సోలో రిలీజ్ కావడం, ఓ పాట వైరల్ అవ్వడంతో ‘వేట్టయన్’పై దృష్టి పడింది. కాకపొతే తెలుగు, లేదా అందరికీ అర్ధమయ్యేలా ఓ ఇంగ్లీష్ టైటిల్ పెడితే ఇంకా బావుండేది. కానీ అదే పేరుతో రిలీజ్ చేస్తున్నారు.
సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్‌హీరో’ 11న వస్తోంది. ఇదొక ఫ్యామిలీ డ్రామా. అర్జున్ మేనల్లుడు ధ్రువ హీరోగా ‘మార్టిన్’, అలియా భట్ ‘జిగ్రా’ డబ్బింగ్ బొమ్మలు కూడా అదే రోజు వస్తున్నాయి. సుహాస్ ‘జనక అయితే గనక’ సినిమాతో 12న వస్తున్నాడు. దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడం, పాయింట్ లో కూడా కొత్తదనం వుండటంతో ఆసక్తి ఏర్పడింది. ఇక మూడో వారంలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు.
చివరి వారంలో దీపావళి కానుక సినిమాలు క్యూ కడుతున్నాయి. దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’, విశ్వక్సేన్ ‘మెకానిక్ రాకీ’, సత్యదేవ్, డాలీ ధనంజయ ‘జీబ్రా’, శివ కార్తికేయన్ ‘అమరన్’ ఈ సినిమాలన్నీ 31న బాక్సాఫీసు ముందుకు వస్తున్నాయి. ఈ ఐదు సినిమాలపై మంచి క్రేజ్ వుంది. జోనర్స్ పరంగా కూడా దేనికవే ప్రత్యేకమైన సినిమాలు. మొత్తానికి అక్టోబరులో కొత్త సినిమాలకు లోటు లేదు. మరి ఎన్ని చిత్రాలు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తాయో చూడాలి.