నాని సినిమా అంటే… కుటుంబ సమేతంగా చూసేలా ఉంటాయి. తన ఫ్యాన్స్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ. అయితే.. దసరా మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. టైటిల్ సాఫ్ట్ గా ఉంది కానీ, లోపల మేటర్ వేరేలా ఉంది. టీజర్, ట్రైలర్ చూస్తేనే ఆ విషయం అర్థం అవుతోంది. నాని మాస్ అవతార్, ఆ యాక్షన్ మూమెంట్లు ఇవన్నీ నాని గత చిత్రాల కంటే భిన్నంగా కనిపిస్తున్నాయి. దానికి తోడు సెన్సార్ వాళ్లు ఏకంగా 36 కట్స్ వేశారు. నాని సినిమాకే కాదు.. ఈమధ్య ఇన్ని సెన్సార్ కట్స్ పడిన సినిమా ఇదేనేమో..?
దీనిపై దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్పందించారు. ”నాకు సెన్సార్ నిబంధనల గురించి పెద్దగా తెలీదు. బాంచత్ అనే పదం ఈ సినిమాలో ఉంది. ఆ పదాన్ని తెలంగాణలో చాలా సాధారణంగా వాడతారు. అందులో బూతు లేదు. బాంచత్ లానే, బాంచన్.. అనే మరో పదం ఉంది. ఇవి రెండూ వేరు. ఇదే.. అర్థం వచ్చేలా ఓ బూతు పదం కూడా ఉంది. అది వేరు. ఈ మూడు పదాల అర్థాలూ ఒక్కటే అనుకొంటున్నారు. బాంచత్ అనే పదం ఓ పాటలో నాలుగుసార్లు వచ్చింది. నాలుగు కట్స్ పడ్డాయి. అలా కట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతే తప్ప.. మా సినిమాలో బూతు, పెద్దలు నొచ్చుకొనే సన్నివేశాలూ ఏం ఉండవు” అని క్లారిటీ ఇచ్చారు. కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈ చిత్రం ఈనెల 30న విడుదల అవుతోంది. నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందించిన చిత్రమిది.