దాసరి నారాయణరావు నుంచి ‘అమ్మ’ అనే సినిమా వస్తోందన్న వార్త నాలుగు రోజుల క్రిందట గుప్పుమంది. జయలలిత జీవిత కథని దాసరి తెరపై ఆవిష్కరిస్తున్నారన్నది ఆ వార్త సారాంశం. దాంతో మీడియా ఒక్కసారిగా ఎలెర్ట్ అయ్యింది. దాసరి ‘అమ్మ’గా ఎవరు కనిపిస్తారు? అందులో ఏమేం చూపిస్తారు? మరణం వెనుక గుట్టు విప్పుతారా? ఇలా రకరకాల ప్రశ్నలు. ఇంకొంతమందైతే… జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుందని కూడా జోస్యం చెప్పేశారు. అయితే తెలుగు 360 మాత్రం.. ‘టైటిళ్ల వరకేనా…. సినిమాలు తీసేదేమైనా ఉందా?’ అంటూ ఓ కథనం ప్రచురించింది. ఇప్పుడు అదే జరిగేలా కనిపిస్తోంది. దాసరి ‘అమ్మ’ కూడా కేవలం టైటిల్‌కే పరిమితమయ్యే ప్రాజెక్టు అయ్యే అవకాశాలే ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల టాక్.
ఈ రోజు దాసరి ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సక్సెస్ మీట్‌కి అతిథిగా వచ్చారు. ఆ సమయంలో ‘అమ్మ’ సినిమా ప్రస్తావన వచ్చింది. దానికి ఆయన సమాధానం కూడా చెప్పారు. ‘అమ్మ’ సినిమా తీస్తానని నాకు నేనుగా ఎప్పుడూ చెప్పలేదే.. అంటూ క్లారిటీ ఇచ్చేశారు. ‘ఎవరో ఏదో రాశారు.. ‘ అంటూ వచ్చిన వార్తల్ని కూడా ఒక్క ముక్కలో తేల్చిపడేశారు.
నిజానికి ‘అమ్మ’ కథని సినిమాగా తీద్దామని దాసరి భావించిన మాట వాస్తవమే. కాకపోతే..ఇప్పటి వరకూ కథేం అనుకోలేదు. ‘తీస్తే బాగుంటుంది’ అన్న ఆలోచన తప్ప… ఈ సినిమాకి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దానికే ‘అమ్మ’ కథ రెడీగా ఉందని, ఆ పాత్ర కోసం దాసరి అన్వేషణ ప్రారంభమైందన్న వార్తలు గుప్పుమన్నాయి. ‘దాసరి ఏదో మాట వరసుకు అంటే…దాన్ని హైలెట్ చేస్తూ మీడియా వార్తలు రాసిందంతే. అంతకు మించి ఏం లేదు’ అంటూ దాసరి కాంపౌండ్ వర్గాలే క్లారిటీ ఇచ్చేశాయి. అంటే.. ‘అమ్మ’ కథ… ఇక్కడితో సమాప్తం అన్నమాట.