దాసరి ఇంటి గొడవ – పోలీసు స్టేషన్ మెట్లెక్కింది. తన తమ్ముడు తన ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించాడని, తనని దుర్భాషలాడాడని, ఇంటి బీరువా తెరవడానికి ప్రయత్నించాడని దాసరి ప్రభు.. దాసరి అరుణ్ కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జూబ్లీహిల్స్ పోలీసులు అరుణ్ కుమార్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు కూడా చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో దాసరి అరుణ్ కుమార్ స్పందించారు. తన ఇంటి గోడ తాను దూకితే తప్పేంటని ప్రశ్నించారు. తన తండ్రి వీలునామా ప్రకారం ఆ ఇంటిలో తనకీ భాగం ఉందని గుర్తు చేశారు. తండ్రి రాసిన వీలునామాని ప్రభు చూపించాలని డిమాండ్ చేశారు. ప్రభు ఆరోపించినట్టు తన తండ్రి ఆస్తులు తాను ఎవరికీ అమ్మలేదని క్లారిటీ ఇచ్చారు. తమది చిన్న గొడవలే అని, కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అయిపోతాయని, కోర్టుకి వెళ్లాల్సిన పనిలేదని అన్నారు అరుణ్ కుమార్. ఈ విషయంలో సినిమా పెద్దలు జోక్యం చేసుకుని పరిష్కారం చూపిస్తే, అందుకు తనకు అభ్యంతరం ఏమీ లేదని చెప్పుకొచ్చారు.